హైదరాబాద్ బ్రాండ్ గా ప్రపంచప్రసిద్ది చెందిన కరాచీ బేకరీని కొంత మంది టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి పాకిస్తాన్ తో సంబంధం లేకపోయినా అచ్చమైన భారతీయులు అయినా.. పైగా హిందువులే అయినా కొంతమంది టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా లోకల్ నాయకులు కొంత మంది వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఆదివారం శంషాబాద్ లోని కరాచీ బేకరీపై కొంత మంది దాడి చేశారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా సరిగ్గా అడ్డుకోలేదు. ఈ దాడులు చూసిన సామాన్యులకు.. ఇదేం తీవ్ర వాదం అన్న ఆగ్రహం తెప్పించింది.
పౌరుల ఆస్తులపై దాడులు చేయడం ఘోరం !
పౌరుల ఆస్తులను.. వారు ఇతర దేశస్తులు అని ఆరోపించి దాడులు చేయడం అంటే చిన్న విషయం కాదు. కరాచీ బేకరీ అనే పేరు ఉన్నందున అది పాకిస్తాన్ ది అని చెప్పి దాడులు చేయడం అంత తెలివి తక్కువ పని ఉంటుంది. ఇప్పుడు వీధి వీధినా చైనీస్ దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలు పెట్టుకున్న వారంతా చైనీయులా ?. అలాంటి వాటిపై దాడులు చేస్తారా?. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడానికి లోకల్ గూండాలు ఈ వివాదాలను అందుకుని దాడులు చేస్తున్నారు. వీరు తీవ్రవాదుల కన్నా ప్రమాదకరం అత్యంత కఠిన చర్యలతో వీరిని కట్టడి చేయాల్సి ఉంది.
దేశ విభజన సమయంలో వచ్చేసిన కరాచీ బేకరీ కుటుంబం !
దేశ విభజన సమయంలో పౌరులకు ఏ దేశంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించారు. పాకిస్తాన్ నుంచి వచ్చేసిన లక్షలాది మంది హిందూ కుటుంబాల్లో ఒకటి ఖాన్ చంద్ రామ్ నాని అనే వ్యాపారి కుటుంబం కూడా. హైదరాబాద్లోని కరాచీ బేకరీ 1953లో ఖాన్చంద్ రామ్నాని అనే సింధీ వ్యాపారి ప్రారంభించారు. అతను 1947లో భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో కరాచీ నుండి హైదరాబాద్కు వచ్చేశారు. ఈ బేకరీని అతను తన పుట్టిన ఊరైన కరాచీ నగరం పేరుతో ప్రారంభించాడు. ప్రస్తుతం, కరాచీ బేకరీని రామ్నాని కుటుంబం యొక్క మూడవ తరం నిర్వహిస్తోంది. యుఎస్ఎ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో సహా 20 కంటే ఎక్కువ దేశాలకు బిస్కెట్లు ఎగుమతి చేస్తుంది. ఇలాంటి బ్రాండ్ పై దాడులు చేయడం మానసిక వికారానికి నిదర్శనం.
కఠిన చర్యలు తీసుకోవాలి !
ప్రభుత్వాలు ఇలాంటి దాడులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉపేక్షిస్తే.. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వనట్లే. ఒక్క సారి ఇలాంటి దాడి చేసిన వారిపై తీసుకునే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసేలా చేయాల్సి ఉంది. అలా చేస్తే.. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీ సారి వచ్చి పడే ఇలాంటి వారికి భయం వస్తుంది. చైనాతో ఎప్పుడైనా గొడవలు జరిగితే చైనా బజార్ల మీద పడతారు. పాకిస్తాన్ తో గొడవలు వస్తే కరాచీ బేకరీ వంటి సంస్థలపై పడతారు. ఇలాంటి మనస్థత్వం మన దేశానికే ప్రమాదకరం.