‘థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఇక్కడా….’ అంటూ నవ్వులు పంచే ఫృద్వీ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పడ్డాడు. అదేలెండి… కాలేజీ కుర్రాడిగా ఓ సినిమాలో కనిపించబోతున్నాడు. ఫృథ్వీ ఏంటి? కాలేజీ కుర్రాడేంటి? జోకా? అనుకొంటారని తెలుసు. జోక్ అనుకొంటారని, నవ్వుకొంటారని తెలిసే ఆ క్యారెక్టర్ని అలా ప్లాన్ చేశారు. ‘వీడికే కాలేజీ వెళ్లే అబ్బాయి ఉన్నాడంటే నమ్ముతారు.. ఈడు కాలేజీ స్టూడెంటేంటి’ అంటూ ఓ డైలాగ్ కూడా వేసేశారు. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ సినిమాలో ఫృద్వీ ఇంచుమించు హీరోలాంటి పాత్ర పోషిస్తున్నాడు. తనో కాలేజీ స్టూడెంట్. లవ్ స్టోరీ కూడా ఉంది. ‘ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా’ అంటూ ఆర్పీ పట్నాయక్ పాటని బ్యాక్ గ్రౌండ్లో వేసుకొని ఏ ఎమోషన్ సీన్ కూడా పండించేశాడు కామెడీగా. అంతే కాదు.. సలోనీతో ఓ పాటకి స్టెప్పులు కూడా వేశాడు.
మొత్తానికి ఈ 30 ఇయర్స్ శాల్తీని బాగానే వాడేస్తున్నారు. నవీన్ చంద్ర ని పోస్టర్ పై చూస్తే జనాలు రారని ఫిక్సయిపోయారేమో? ఇప్పుడు 30 ఇయర్స్ ఫృద్వీనే హీరో అంటూ ఈ సినిమా టీజర్‌ని కట్ చేసి జనాల్లోకి వదిలారు. సీను మధ్యలోకి ఫృద్వీ సడన్‌గా వచ్చి కామెడీ చేసి వెళ్లిపోతే బాగానే ఎంజాయ్ చేసేవాళ్లం. సినిమా మొత్తం కనిపిస్తే బోర్ కొట్టేయదూ. ఆ జాగ్రత్తలు తీసుకొంటే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాకి కోట్లు రాకపోయినా… కాలక్షేప చిత్రంగా పేరు తెచ్చుకొని నాలుగు కాసులు సంపాదించుకొంటుంది.