Psych Siddhartha movie review
Telugu360 Rating: 1.75/5
నందు మంచి నటుడే కానీ సోలో హీరోగా ఒక్క విజయం కూడా లేదు. ఇప్పుడు తానే నిర్మాతగా ‘సైక్ సిద్ధార్థ’ చేశాడు. సురేష్ బాబు ఈ సినిమాని కొనుగోలు చేయడం, యువతరాన్ని ఆకట్టుకునే కంటెంట్ కనిపించడం, నందు ప్రమోషన్స్ లో కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇవన్నీ సినిమాపై కొంత బజ్ క్రియేట్ చేశాయి. మరి నందు కోరుకున్న సోలో విజయం దక్కిందా? కొత్త ఏడాదిలో ‘సైక్ సిద్ధార్థ’ పంచిన వినోదం కొత్తగా ఉందా?
సిద్ధార్థ (నందు) ఓ పబ్ లో త్రిష (ప్రియాంక)ని కలుస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. త్రిషని నమ్మి బిజినెస్లో రెండు కోట్లు పెట్టుబడి పెడతాడు. పార్టనర్ గా వచ్చిన మన్సూర్ (సుఖేష్ రెడ్డి) త్రిషని తన లైన్ లో పెట్టుకుంటాడు. బిజినెస్, గర్ల్ ఫ్రెండ్.. రెండూ పోయి ఒక బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకొని అజ్ఞాతంలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ గడదిపేస్తుంటాడు సిద్దార్థ. అదే బస్తీలోకి శ్రావ్య (యామిని భాస్కర్) తన కొడుకుతో సిద్ధార్థ ఇంటి కింది పోర్షన్లో అద్దెకు దిగుతుంది. తర్వాత ఏం జరిగింది? శ్రావ్య ఎవరు? సిద్ధార్థ జీవితంలోకి త్రిష మళ్ళీ వస్తుందా? శ్రావ్యతో పరిచయం సిద్ధార్థలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనేది మిగతా కథ.
సినిమాకి ఒక ఫార్ములా, రూల్ అంటూ లేదు. కొందరు కొన్ని ఫార్ములాలు, రూల్స్ ఫాలో అయినప్పటికీ వాటిని బ్రేక్ చేస్తూ కొత్తరకం సినిమాలతో అలరించే ఫిల్మ్ మేకర్స్ కూడా వున్నారు. ముఖ్యంగా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ బోలెడు ప్రయోగాలకు అవకాశం కల్పిస్తోంది. ఆలోచనలు, ట్రీట్మెంట్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే.. ఇవన్నీ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే ఎంత చేసినా అంతిమంగా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే కథ, పాత్రలు, సన్నివేశాల సమాహారం కావాలి. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇక్కడే దొరికిపోతారు. సైక్ సిద్ధార్థ సమస్య కూడా ఇదే.
ఎంత న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అయినా.. తెరపై చూస్తున్న ఒక క్యారెక్టర్ పై ఆడియన్స్ కి ఎంపతీ క్రియేట్ కావాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతారు. ఇది సిద్ధార్థ కథ. సన్నివేశాలన్నీ ఆ పాత్ర చుట్టూనే తిరుగుతాయి. కానీ ఏ సన్నివేశంలో కూడా ఆ పాత్రపై ఆడియన్స్ కి చెప్పుకోదగ్గ ఫీలింగ్ క్రియేట్ అవ్వదు. అనవసరమైన అరుపులు, గోల తప్పితే ఆ పాత్రలోకి ప్రేక్షకుడు లీనం అవ్వలేడు. ఆ పాత్ర లక్షణమే అలాంటిదనుకుంటే.. అలాంటి అభిరుచి వున్న ప్రేక్షకులకు బహుశా ఆ లౌడ్ నెస్ కనెక్ట్ కావచ్చు.
కథగా చెప్పుకుంటే చాలా చిన్న పాయింట్. అమ్మాయి మోసం చేయడం వల్ల డార్క్, డిప్రెషన్ లో బ్రతుకుతున్న కుర్రాడు, మరో అమ్మాయి కారణంగా వెలుగులోకి వస్తాడు. ఇంతే కథ. ఈ కథని దర్శకుడు న్యూ ఏజ్ స్టయిల్ లో ప్రజెంట్ చేశాడు. అయితే ఈ స్టయిల్ ఫస్ట్ హాఫ్ లో ఒక వీడియో గేమ్ లాంటి ట్రీట్మెంట్ తో వుంటుంది. కొంతమందికి ఈ స్టయిల్ చిరాకు గలిగించే ఛాన్స్ కూడా వుంది. ఇంకొంతమందికి థ్రిల్లింగ్ గా అనిపించి ఉండొచ్చు. సెకండ్ హాఫ్ లో కథ కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సిద్ధార్థ లో వచ్చే మార్పు, పెయింటింగ్స్, చిన్న పిల్లాడి ట్రాక్ ఓకే అనిపిస్తాయి.
అయితే సిద్ధార్థ కథని అసలైన ప్రేమ కోసం తపిస్తున్న వ్యక్తిగా ముగించారు. ఈ మొత్తం సినిమాలో ఆ క్యారెక్టర్ ప్రేమ, తోడు కోసం పాకులాడుతున్న వ్యక్తిలా కనిపించదు. దీంతో క్లైమాక్స్ సడన్ గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే రెండు గంటల నిడివి మాత్రమే వుండటం సినిమాకి కొంతలో కొంత కలిసోచ్చింది.
నందు చాలా బోల్డ్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిద్ధార్థ క్యారెక్టర్ గోలగోలగా వుంటుంది. ఆ క్యారెక్టర్ ని సైక్ ని అర్ధం చేసుకుంటూ నటించాడు. నరాలు కనిపించేలా అరిచి డైలాగులు చెప్పడం అదోరకమైన కష్టం. యామిని భాస్కర్ అందంగా, పద్దతిగా కనిపించింది. తన నటన సహజంగా వుంది. కాకపోతే ఈ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ సహజంగా బిల్డ్ చేసే సీన్స్ పడలేదు. త్రిష పాత్రలో చేసిన ప్రియాంక ది బోల్డ్ క్యారెక్టర్. కొన్ని సీన్స్ లో సిదార్ద, త్రిష ప్రవర్తించే తీరు చూస్తే.. జెన్జీ బ్యాచ్ ఇంతే అనుకోవాలి. ఫ్రెండ్ గా చేసిన నటుడు సహజంగా కుదిరాడు. చాలా వరకు కొత్త నటులు కనిపించారు.
వరుణ్ రెడ్డి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ని ఫాలో అయ్యాడు. ఎడిటింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మూడు సీన్స్ ఒకేసారి నడుస్తుంటాయి. రీల్స్ ఫాలో అయ్యేవారికీ ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ మీద ఒక వీడియో గేమింగ్ నడిచినట్టే వుంటుంది. కెమరా వర్క్, స్మరణ్ సాయి మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ కి సరిపడ్డాయి. వరుణ్ కొన్ని డైలాగుల్ని బానే రాసుకున్నాడు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. అలాగని ఆడియన్స్ పూర్తిగా ఎంగేజ్ చేసిన సినిమా కూడా కాదు.
Telugu360 Rating: 1.75/5
