జగన్ రెడ్డికి 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు చాలా మంది అనుకున్న ఒకే ఒక్క మాట… “ ఇక జగన్ రెడ్డి ఏమీ చేయకపోయినా పర్వాలేదు .. అలా చేసినట్లుగా నటించినా వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తారు” అని. అంటే.. వ్యతిరేకత పెంచుకోకుండా పాలన చేస్తే చాలు అనుకున్నారు. కానీ జగన్ రెడ్డి ఏదో చేయాలని అనుకుని పిచ్చి పిచ్చిగా పాలన చేశారు. చివరికి పిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన మారిపోవడంతో ప్రజలు భరించలేమన్న స్థితికి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఏమీ చేయకుండా ఉన్నా బాగుండేదన్నా అని కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా మారడం లేదు. ఏదో చేయాలనుకుని తన పార్టీని నిర్వీర్యం చేసుకుంటున్నారు.
ప్రజలు అసహ్యించుకునే రాజకీయాలు చేయడంలో స్పెషలిస్ట్
జగన్ రెడ్డి ప్రజా కోణంలో ఎప్పుడూ రాజకీయాలు చేయరు. చంద్రబాబు కోణంలోనే చేస్తారు. ఆయనను టార్గెట్ చేయడమే జగన్ రాజకీయం. ఈ క్రమంలో జనాలతో కనెక్షన్ కట్ అయిపోయింది. వారేమనుకుంటున్నారో పట్టించుకోవడంలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి ఏపీలో జరిగిన ప్రతి అంశానికి ఆయనతో ముడిపెట్టి రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోతున్నారు. రౌడీలకు మద్దతు తెలుపుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. తమ పార్టీ నేతలతో మళ్లీ బూతులు మాట్లాడిస్తున్నారు. వీటన్నింటి వల్ల ప్రజలు ఎలా అయితే భయపడి ఓట్లేయలేదో.. వారంతా తమ మనసు మారకుండా చేసుకుంటున్నారు. వైసీపీని మరింత అసహ్యించుకునే పరిస్థితులు కల్పించుకుంటున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే వరకూ ఆగలేని తొందర
ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూంటే.. ఆ సమయాన్ని చూసి ప్రజల్లోకి వెళ్లాలి. అది కూడా ప్రజల్లో ఏ అంశంపై అసంతృప్తి పెరుగుతుందో ఆ అంశాన్ని తీసుకుని వెళ్లాలి. కానీ ఏడాది పాలనలో అసంతృప్తి పెరగకపోగా.. జగన్ రెడ్డి పాలనా పరిస్థితుల్ని తల్చుకుని.. చాలా బెటర్ అన్న భావనకు ప్రజలు వచ్చారు. అది ఇంటింటికి పాలనలో తొలి అడుగు పేరుతో వెళ్తున్న కార్యక్రమంలో కనిపిస్తోంది. కనీసం వైసీపీకి చెందిన వారు కూడా.. తమకు ఆ పథకం రాలేదని లేదా మరో సమస్యపై కానీ అడగడం లేదు. ఏడాదిలో చాలా వరకూ పెండింగ్ లో ఉన్న పనులు ప్రారంభించడం.. తల్లికి వందనం పథకం అందించడమే కారణం. ఇలాంటి సమయంలో విపక్షం కాస్త సమయం తీసుకోవాలి. కానీ బాబు మోసం అంటూ బయలుదేరారు. ఎక్కడా క్యాడర్ స్పందించడం లేదు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చాలా నియోజకవర్గాల్లో జరగడం లేదు.
జగన్ స్వయం వినాశ రాజకీయాలు – ఎవరు నేర్పాలి ?
జగన్ మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసేవి స్వయం వినాశ రాజకీయాలు. తాము ఇలా కుట్రలు చేస్తామని అందరికీ తెలిసేలా చేస్తారు. పోనీ అందరికీ తెలిసిపోయిది కదా అని.. సిగ్గు పడతారా అంటే పడరు. తాము చేయాలనుకున్నది చేస్తారు. అదే డ్రామాలు అని అందరికీ తెలిసపోయిందని గుర్తించరు. గుడివాడ గొడవల ఇష్యూలో జరిగింది ఇదే. పేర్ని నాని తో కథ నడిపించారు. అందరికీ తెలిసిపోయింది. నమ్మేవాళ్లుంటారు కదా అని.. రెచ్చిపోతున్నారు. కానీ సాధారణ ప్రజల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి ప్రతిపక్షం మీద వ్యతిరేకత పెరగకుండా ఉంటుందా?