ఏ ప్రభుత్వంపై అయినా ప్రజావిశ్వాసం ఎప్పుడు కనిపిస్తుంది?. ఆ ప్రభుత్వంపై నమ్మకం ఎప్పుడు కనిపిస్తుంది?. ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో వారి దృష్టికి తీసుకెళ్లడానికి ఎంతగా ప్రయత్నిస్తారన్న విషయంలోనే అది బయటపడుతుంది. అసలు పట్టించుకోని ప్రభుత్వం అయితే.. ప్రజలు కూడా చెప్పుకుని ఏం సుఖం అని సైలెంటుగా ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో అదే కనిపించింది. కానీ ఇప్పుడు సమస్యలు, అభివృద్ధిపనుల కోసం వినతుల వెల్లువ కనిపిస్తోంది.
అభివృద్ధి పనుల కోసం గ్రామ స్థాయి నుంచి విజ్ఞప్తులు
మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు వచ్చేస్తున్నారు ప్రజలు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ప్రజల వినతులు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న పద్దతుల్లో ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా ఇలాంటి సమస్యలు లేవెనత్తిన వారిపై ఉక్కుపాదం మోపింది. కేసులు పెట్టింది. అందుకే అప్పట్లో అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతిలో సమస్యల పరిష్కారం వచ్చిన వారికి పరిష్కారం చూపిస్తోంది. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి నిరసనలు లేదా వినూత్నంగా తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చురుగ్గా లేకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
జగన్ హయాంలో సమస్యలు చెబితే కేసులు
వైసీపీ ఐదేళ్ల కాలంలో సామాన్యుడి గొంతు వినే నాథుడే కరువయ్యారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమస్యలు పేరుకుపోయినా, వాటిని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోయేవారు. తమ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై ఉక్కుపాదం మోపడం, అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కడం గత పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ భయానక వాతావరణంలో ప్రజలంతా తమ బాధలను లోలోపలే అణచుకుని నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది. కానీ, నేడు ఏపీలో ఆ భయం నీడలు తొలగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక కొత్త భరోసా కనిపిస్తోంది. గతంలో వినతిపత్రం ఇవ్వాలంటేనే భయపడిన ప్రజలు, ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అవలంబిస్తున్న ప్రజాస్వామ్య పద్ధతులు సామాన్యుడికి పెద్ద దిక్కుగా మారాయి. అందుకే ప్రజలు వినూత్న రీతుల్లో నిరసనలు తెలుపుతూనే, తమ సమస్యలను నేరుగా పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మా గోడు వినే వారు ఉన్నారు అనే నమ్మకం ప్రజల్లో కలిగించడమే ఈ ప్రభుత్వ మొదటి విజయం.
సమస్యలన్నీ రాత్రికి రాత్రే పరిష్కారం కావు!
రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్లు, సాగునీటి కాలువలు, పాఠశాలల సమస్యలను రాత్రికి రాత్రే పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇది ఏ మంత్రదండంతో అయ్యే పని కూడా కాదు. కానీ, పరిష్కారం దిశగా అడుగులు పడటం ఇక్కడ కీలకం. మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధాన్యతను బట్టి, నిధుల లభ్యతను బట్టి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పాలకుల ఆలోచన విధానంలో మార్పు వస్తే, ఫలితాలు ఎలా ఉంటాయో ఏపీలో నేడు కనిపిస్తున్న ప్రజా చైతన్యమే నిదర్శనం. నాయకుల మధ్య సమన్వయం, అధికారులకు దిశానిర్దేశం చేయడం వల్ల పాలనలో వేగం పెరిగింది. సామాన్యుడి కన్నీళ్లు తుడిచేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
స్థానిక ప్రజా ప్రతినిధుల వైఫల్యం
నిజానికి నేరుగా సమస్యలు సీఎం,డిప్యూటీ సీఎం వద్దకు రావాల్సిన అవసరం లేదు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం వల్లనే పై స్థాయి వరకూ వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా కింది స్థాయి వ్యవస్థల్లో చైతన్యం తీసుకు వచ్చి చురుకుపుట్టేలా చేయగలిగితే.. చాలా సమస్యలు పై వరకూ రాకుండానే పరిష్కారం అవుతాయి.
