పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సులను కడపకు తరలించారు. పధ్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఫలితం ఏమిటన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. వైసీపీ పడుతున్న కంగారు, ఆరోపణలు, ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చేస్తున్న ప్రకటనలతో.. ఆ పార్టీకి ఓ క్లారిటీ వచ్చేసిందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇలాంటి ఆత్మరక్షణ ధోరణి ప్రకటనలు రాలేదు. కానీ గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
పులివెందులలో గెలిచి ఏం చేస్తారని అంబటి రాంబాబు టీడీపీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ అక్కడ టీడీపీ గెలిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వైసీపీ నేతలకు బాగా తెలుసు. జగన్ రెడ్డి కంచుకోట కుప్పకూలిపోయినట్లు అవుతుంది. అంత కంటే ముఖ్యంగా జగన్ రెడ్డి పరువు పోతుంది. కుప్పంలో మున్సిపాల్టీ గెలిచి.. అసెంబ్లీకి వచ్చి.. చంద్రబాబు ముఖం చూడాలనుందని వెకిలిగా జగన్ మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఉంటాయి. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా.. పులివెందుల జడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత అదే చెబుతారు. జగన్ రెడ్డి ముఖాన్ని చూడాలనుకుంటారు.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రిగ్గింగ్ చేశారని ఎన్ని ఆరోపణలు చేసినా.. అవన్నీ కవర్ డ్రైవ్ కిందకే వస్తాయి కానీ..తామే గెలవాల్సిందని చెప్పుకోలేరు. ఎందుకంటే ఎంత చేసినా దశాబ్దాలుగా ఏకగ్రీవం చేసుకుంటున్న జడ్పీటీసీ స్థానం అది. అక్కడి గ్రామస్తులు ఓట్లేయకుండా.. పూర్తిగా రిగ్గింగ్ చేసి గెలవడం అనేది సాధ్యం కాదు. రిగ్గింగ్ చేస్తే గీస్తే వైసీపీ వాళ్లే చేయాలి. వారికి ఆ గ్రామాల్లో ఉన్న పట్టు అలాంటిది. కానీ ఇప్పుడు ఓడిపోయాక.. అక్రమాల ఏడుపులు ఏడిస్తే జాలి పడతారు.
ఫలితాలపై వైసీపీ స్పందనను బట్టి చూస్తే వారు మానసికంగా సిద్ధమైపోయారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ మాత్రం ఫలితాలు వచ్చే వరకూ చూద్దామని గుంభనంగా ఉంది. మొత్తంగా వైసీపీ పరువు బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. గురువారం ఫలితం తేలిపోతుంది.