భారత ప్రజాస్వామ్యంలో పులివెందుల లాంటి నియోజకవర్గాలు చాలా పరిమితంగా ఉంటాయి. ముఠాలు రాజ్యమేలే బీహార్లోనూ ఇలాంటి నియోజకవర్గాలు పరిమితంగా ఉంటాయి. మొత్తం ఓ ముఠా గుప్పిట్లో పెట్టుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ప్రజలతో సంబంధం లేకుండా తామే పదవుల్ని పంచేసి.. ఫ్యాక్షన్ ముఠాల్ని పెంచి వారితో భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఏకగ్రీవంగా నిర్వహించేస్తూ ఉంటాయి. ఇన్నాళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారుతోంది. జడ్పీటీసీ ఉపఎన్నికతో అక్కడి ప్రజలకు ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయామో తెలుసుకునే అవకాశం వచ్చింది.
ఇంత కాలం భయానిదే పులివెందులలో అధికారం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఓటర్ ఆయుధం. దాన్ని లాక్కునే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం. దాన్ని దశాబ్దాలుగా పులివెందులలో అమలు చేస్తున్నారు. ప్రశ్నించేవారు లేకుండా పోయారు. ప్రశ్నిస్తే దాడులు చేసేవారు. అలాంటి పరిస్థితి నుండి నేడు.. మాకే ఓటేయాలని బతిమాలడం కాదు..డబ్బులు కూడా ఇస్తున్నారు. ఏ సమస్యలు ఉన్నా తీరుస్తామంటున్నారు. ఇది అక్కడి ప్రజల్ని ఆశ్చర్య పరుస్తోంది. ఇంత కాలం తమ సమస్యలు తీర్చేందుకు ఎందుకు రాలేదని ఏమైనా అడగాలంటే..ఎందుకు భయపెట్టేవారని ప్రశ్నించుకుంటున్నారు.
ప్రజలకు ప్రజాస్వామ్య బలంపై తొలి సారి నమ్మకం
ప్రజలకు ప్రజాస్వామ్యం గురించి అవగాహన పెరిగితే రాజకీయ నేతల దౌర్జన్యాలకు అవకాశం ఉండదు. ఇంత కాలం ఇలాంటి అవకాశం పులివెందుల ప్రజలకు ఓ కుటుంబం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కుటుంబం అధికార మత్తులో పడి హత్యలు చేసుకుని రోడ్డున పడింది. అందరూ చీలిపోయారు. ఇప్పుడు అక్కడ ప్రజలకు స్వేచ్ఛ వచ్చేందుకు గొప్ప అవకాశం లభించింది. ఈ జడ్పీటీసీ ఉపఎన్నిక కేవలం మొదటి అడుగు మాత్రమే. అక్కడి ఓటర్లు స్వేచ్చను..ప్రజాస్వామ్యాన్ని అందిపుచ్చుకోవడానికి వచ్చిన మొదటి అవకాశం.
ప్రజా అవగాహనతోనే పులివెందులకు విముక్తి
దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో మరొకరు బలంగా ఎదగకుండా వైఎస్ కుటుంబం గుప్పిట్లోకి తీసుకుంది. అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మెజార్టీ గ్రామాల్లో.. రిగ్గింగ్ జరుగుతుంది. ప్రజలు ఓట్లు వేయరు. ఓటర్ స్లిప్పులు మాత్రం అక్కడ ఉన్న ముఠాలకు ఇచ్చి వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్య పవనాలు వీస్తున్నాయి. ప్రజలు అవగాహన పెంచుకుంటే.. పులివెందులకు నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లే అనుకోవచ్చు.