పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. అవినాష్ రెడ్డి వల్ల కావడం లేదు. ఇంత కాలం ఊళ్లోనే ఉండి చూసుకున్న వైఎస్ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ కు పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే తనకు పులివెందులకు వెళ్లే అవకాశం ఇప్పించాలని ఆయనతో కోర్టులో పిటిషన్ వేయించారు. ఆయన చెప్పిన కారణాలేమిటంటే.. ఆయనకు వ్యవసాయం ఉందట..అనారోగ్య సమస్యలు ఉన్నాయట. అందుకే పులివెందుల వెళ్తానంటున్నారు.
ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారు. టీడీపీలో చేరిన ఓ వైసీపీ నేతకు ఫోన్లు చేసి అంతు చూస్తామని బెదిరించారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నారు. పన్నెండో తేదీన జడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజు అయినా వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందులలో ఉంటే.. ఆయనను చూసి భయపడి అయినా.. వైసీపీ క్యాడర్ వైసీపీకే ఓటు వేస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు ఆయన చెప్పినట్లుగా నేరాలు , ఘోరాలు చేసి శివశంకర్ రెడ్డి అనే మరో వివేకా కేసు నిందితుడికీ పులివెందులలోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. బెయిల్ షరతుల్లో హైదరాబాద్ లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. అందుకే వారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. మరి కోర్టు పోలింగ్ రోజుకైనా పులివెందులకు వెళ్లేందుకు అనుమతిస్తుందా ?