వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమస్యలు చుట్టు ముడుతున్నాయి. అసలే పరిస్థితులు బాగోలేవని బాధపడుతూ .. ఏడ్వలేక నవ్వతూంటే..కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. కొత్త సమస్య ఏమిటంటే.. పులివెందులకు ఉపఎన్నిక. అయితే ఎమ్మెల్యే స్థానానికి కాదు.. జడ్పీటీసీ స్థానానికి. పులివెందుల నుంచి జడ్పీటీసీగా గెలిచిన వ్యక్తి .. చాలా కాలం కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ స్థానం అప్పటి నుంచి ఖాళీగా ఉంది. అలాగే కడప నగరంతో కలిసి ఉంటే ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ రెండు స్థానాలతో పాటు మరికొన్ని ఎంపీటీసీ స్థానాలకు ఉపెన్నికలు జరగనున్నాయి.
వాటి సంగతి పక్కన పెడితే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటీసీలు మాత్రం జగన్ పరువు సమస్య లాంటివి. అన్నీ బాగున్నప్పుడు ఆయా చోట్ల ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయితే పులివెందులలో ప్రస్తుతం జగన్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆయన సోదరుడు దుష్యంత్ రెడ్డి టీడీపీతో కలిసి పని చేస్తున్నారు. అవినాష్ రెడ్డి పట్టు కోల్పోయారు. బంధువులు చాలా మంది దూరమయ్యాయి. ఇలాంటి సమయంలో ఏకగ్రీవం కాదు కదా.. గెలుపు కూడా కష్టమే.
పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ చేతులెత్తేసింది. ఇప్పుడు ఎన్నికల్లో అక్రమాలు చేస్తారని.. స్వేచ్చగా ఓటేయనివ్వరని కారణాలు చెప్పి పోటీ చేయకుండా వైదొలిగితే అది దివాలా కోరు తనమే అవుతుంది. ఇప్పుడే పోటీ చేయలేకపోతే ఇక పూర్తిస్థాయిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేయడం అనవసరం అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా ప్రభుత్వమే ఉంటుంది. జగన్ రెడ్డి పోటీకి ధైర్యం చేసి.. పులివెందులలో తనకు పట్టు ఉందని నిరూపించుకుంటారో.. పరువు పోగొట్టుకుంటారో వేచి చూడాల్సి ఉంది.