భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆర్థిక సమస్య క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గళమెత్తారు. దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై బ్యాంకులు 24 నుంచి 55 శాతం వరకు అత్యధిక వడ్డీలు, భారీ పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తూ సామాన్యులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఈ దోపిడీ రుణ విధానాల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి ఆమె ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేయాలనే చర్చ నడుస్తున్న తరుణంలో, పురందేశ్వరి భారతదేశంలో కూడా ఇదే తరహా గరిష్ఠ పరిమితి విధించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అప్పులు తీర్చలేక చాలామంది యువకులు అప్పుల ఊబి లో కూరుకుపోతున్నారని, ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వినియోగదారుల హితాన్ని కాపాడేలా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా బ్యాంకులు వసూలు చేసే అదనపు ఛార్జీలు, పెనాల్టీలపై నియంత్రణ లేకపోవడం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
ఎవరూ పెద్దగా పట్టించుకోని, మెజారిటీ ప్రజలు సైలెంట్‌గా బాధపడుతున్న ఈ సున్నితమైన అంశంపై పురందేశ్వరి స్పందించిన తీరు క్రెడిట్ కార్డు వాడే వాళ్లందరికీ తమ బాధలు చెప్పే ప్రజాప్రతినిధి ఉన్నందుకు సంతృప్తి పడతారు. ఈ క్రెడిట్ కార్డుల దోపీడీపై ఆమె చేసిన ఈ విన్నపంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంటే అమలైతే కోట్లాది మంది మధ్యతరగతి క్రెడిట్ కార్డు హోల్డర్లకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.
