ఏపీకి పట్టిన #@%$ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది! ఏపీ ప్రజలకు ఏమి కావాలో నాయకులకు తెలిసినా కూడా అడ్డంగా అడ్డుకోవడం, కాస్త లాజిక్కులతో ప్రశ్నిస్తే, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పోరాడుతుంటే అడ్డంగా ఎదురుదాడి చేయడం తాజాగా ఏపీ నేతలకు ఫ్యాషనైపోయింది. ఎన్నికల సమయంలో వారు చెప్పింది, కేంద్రం విభజన హామీ మేరకు ఏపీకి అధికారికంగా దక్కిందీ అయిన “ప్రత్యేక హోదా” విషయంలో ఏపీ నేతలే అడ్డుతగులుతున్నారనే విషయం రోజు రోజుకీ బలపడిపోతుంది. ఇక్కడ ఎవరి వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత స్వార్ధాలు, వ్యక్తిగత ఎజెండాలు వారివి. కేంద్రంలోని పెద్దలు ఏమంటారో అని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు.. మోడీ ఏమంటారో అని వారి మిత్రపక్ష నేతలు.. జనాలు ఏమి చేయగలరులే అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. ఏపీ పోతే ఏముందిలో ఇంకా చాలా రాష్ట్రాలున్నాయి అని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు… ఇలా అంతా కలిసి ఎవరి అజెండాలతో వారు ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారనేవి వాస్తవం!
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఎంత మొండిగా ముందుకెళ్తుంది అనడానికి తాజాగా ఒక ఉదాహరణ పురందేశ్వరి రూపంలో వెలుగులోకి వచ్చింది. ఏపీకి చట్టపరంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు అనే విషయం కాసేపు పక్కనపెడితే… ఇవ్వకుండా, ఏపీ వాసులు ఇకపై అడగకుండా టెక్నికల్ ఉన్న అన్ని దారులూ మూసేయాలని నిర్ణయించుకున్నట్లుంది కేంద్రం! తాజాగా పురందేశ్వరి మాటల్లో ఈ విషయం తేటతెల్లమైంది! ఇంతకూ ఆమె ఏమన్నారంటే… “వివిధ కారణాలతో దేశంలో ప్రత్యేక హోదా అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకు ఆ హోదా తొలగిస్తాం.. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేర ఈ నిర్ణయం తీసుకోనున్నాం” అని.
ఈ విషయాలు ఆమె ఏ అధికారంతో చెప్పారు, ఏ అధికారంతో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు అనే విషయం కాసేపు పక్కనపెడితే… ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి తనవంతు సాయం చేయాల్సిన మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి, అంతకు మించి ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు కూతురు అయ్యి ఉండి ఇలా మాట్లాడటంపై పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. కేంద్రంలోని పెద్దలతో మాట్లాడతాను.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తనవంతు ప్రయత్నం తాను చేస్తాను.. ఏపీ వాసుల ఆత్మాభిమానమే అన్నగారి కూతురిగా నాకు ముఖ్యం.. అనాల్సిన పురందేశ్వరి ఇలా మాట్లాడటం పై అన్నగారి అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఏపీ వాసులు కోరుతున్నదేమిటి.. ఎన్నికల సమయంలో ఆమె పార్టీ నాయకులు చెప్పిన మాటలేమిటి.. చేసిన వాగ్దానాలేమిటి.. ఇప్పుడు వీరంతా మైకుల ముందుకొచ్చి చేస్తున్న ప్రసంగాలేమిటి? ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఏపీ వాసులు అడుగుతున్నారని కాదు కానీ, నాయకులైన వీరికి మాత్రం తెలియదా “ప్రత్యేక హోదా” వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేమిటో! తెలిసి కూడా ఎందుకు ఈ నాయకులంతా కలిసి ఆంధ్రులను పిచ్చివాళ్లను చేసి.. మేకను చూపిస్తే, అది కుక్క అని నమ్మబలుకుతున్నారు?