ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంతమంది మిత్రులు ఉన్నారో అంతకంటే చాలా ఎక్కువమందే శత్రువులు ఉన్నారు. వారిలో జగన్మోహన్ రెడ్డి వంటి కొందరు నిత్యం ఆయననే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ సంతృప్తి పడుతుంటే పురందేశ్వరి వంటివారు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా చురకలు వేస్తుంటారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న భాజపా విస్తృత స్థాయి సమావేశనికి హాజరైన పురందేశ్వరి, ఓటుకి నోటు కేసులో ముఖ్యమంత్రికి చురకలు వేశారు.
“ఆయన ఈ అవకాశాన్ని (ఓటుకి నోటు కేసులో ఏసిబి విచారణ) వాడుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొంటారనుకొన్నాను. కానీ ఆయన హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకొన్నారు,” అని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఈ కేసుని ఎదుర్కొనే ధైర్యం లేకనే స్టే తెచ్చుకొన్నారని ఆమె చెపుతున్నట్లు అర్ధం అవుతోంది. ఈ మాట ఆమె ఒక్కరే కాదు ఇంకా చాలా మంది అన్నారు. కానీ ఎన్టీఆర్ కుమార్తె , ముఖ్యమంత్రికి దగ్గర బందువు అయిన పురందేశ్వరి కావడం వలనే ఆమె విమర్శలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆవిధంగా అనడం ఆయన పట్ల ఆమెకున్న వ్యతిరేకతకి అద్దం పడుతోంది. అందుకు కారణాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకొనవసరం లేదు.
ఆమె ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి హోదా కంటే చాలా ఎక్కువగానే సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నప్పటికీ దానికి ‘ప్రత్యేక హోదా’ అనే పేరు పెట్టడానికి సాంకేతికంగా వీలుపడటం లేదని అన్నారు. ఏపికి అన్నివిధాల కేంద్రప్రభుత్వం సహాయం చేయడానికి సిద్దంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో భాజపాని ఆ పార్టీ నేతలు బలోపేతం చేసుకోగలరేమో, కానీ ఆ పార్టీకి ఈ ‘ప్రత్యేక శాపం’ ఉన్నంత కాలం అది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతఃరించడం సాధ్యం కాకపోవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేస్తున్నారు కనుక వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కావచ్చు. రెండునరేళ్ళు గడుస్తున్నా ఇంతవరకు మిత్రపక్షమైన తెదేపాతో స్నేహబంధం బలపరుచుకోలేకపోయారు. పైగా ఈవిధంగా మిరపక్షంపై విమర్శలు చేస్తుండటం వలన దానినీ మరో శత్రువుగా మార్చుకొంటూ పార్టీ ఎదుగుదలకి చేజేతులా అవరోధాలు సృష్టించుకొంటున్నారు. తెదేపా-భాజపాల మధ్య సమస్యలుంటే వాటిని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఈవిదంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం వలన వారికే నష్టం కలుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ స్థాయిలో ఉన్న విభేదాలని పార్టీ స్థాయికి తీసుకువస్తే దాని వలన పార్టీలు కూడా నష్టపోతాయని గ్రహిస్తే మంచిది.