హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. శనివారం రాత్రి పోలీసులు నిర్వహించిన రాపిడ్ టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చినప్పటికీ, ఆదివారం ఉదయం వెలువడిన రక్త పరీక్షల ఫలితాల్లో డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ అధికారికంగా ప్రకటించారు. శరీర మెటబాలిజం కారణంగానే ఫలితాల్లో ఈ మార్పు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌పై శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో అక్కడ మొత్తం 11 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు రోహిత్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ మిశ్రా, మరికొందరు ప్రముఖులు ఉన్నారు. పోలీసుల సోదాల్లో సుమారు రెండు గ్రాముల కొకైన్, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో నమిత్ మిశ్రా తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది.
ఈ కేసులో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా, తాజాగా ఎంపీ పుట్టా మహేష్ పేరుతో కలిపి మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు సిమ్లా నుంచి డ్రగ్స్ సేకరించి ఇక్కడ పార్టీ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. నిందితులందరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ కేసు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. డ్రగ్స్ నియంత్రణ విషయంలో కఠినంగా ఉంటామని ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో, ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు ఇలాంటి కేసులో పట్టుబడటం చర్చనీయాంశమైంది. చట్టం ముందు అందరూ సమానులేనని, నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈగల్ టీం చెబుతోంది.
