మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు మద్దతుగా ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ తెరపైకి వచ్చారు. తన కుమారుడు పుట్టా మహేష్‌పై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు మహేష్‌కు 2021లో గుండె శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండి, ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటాడని అనుకోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రాణం మీద తీపి ఉన్న ఎవరూ కూడా ఇటువంటి పనులకు ఒడిగట్టరని, డాక్టర్ల సూచనల మేరకు మహేష్ తన ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల తీరుపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అసలు రక్తం నమూనాలు తీసుకోకుండానే డ్రగ్స్ పాజిటివ్ అని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా రక్త పరీక్షల రిపోర్ట్ రావడానికి కనీసం 48 గంటల సమయం పడుతుందని, కానీ పోలీసులు కేవలం 5 నిమిషాల్లో యూరిన్ శాంపిల్స్ ద్వారా ఫలితాలను ఎలా ప్రకటించారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చామని పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని, నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని ఆయన చెబుతున్నారు. నిజంగా పుట్టా మహేష్ కు గుండె సంబంధిత వ్యాధి ఉంటే. ఆయన .. తన కుమారుడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న సలహాలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.


