హైదరాబాదీ సంచలనం పీవీ సింధు వంద కోట్ల మంది భారతీయుల కలను నిజం చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జపాన్ షట్లర్ ఓకుహారాపై వరస గేముల్లో విజయం సాధించింది. 21-19, 21-10 తేడాతో విజయ దుందుభి మోగించింది.
తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ప్రతి పాయింట్ కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో గేమ్ మొదటి 10 నిమిషాలు ఓకుహారా ఆత్మ విశ్వాసంతో ఆడింది. సింధుకు గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత సింధు దూకుడుకు తల వంచింది. ఈ విజయంతో సింధు ఫైనల్లో ప్రవేశించింది.
ఫైనల్లో స్పెయిన్ అమ్మాయి కరోలినా మారిన్ తో సింధు తలపడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే సింధు స్వర్ణ పతకంతో మెరుస్తుంది. ఓడితే రజత పతకం దక్కుతుంది. మొత్తానికి పతకం ఖాయం. శుక్రవారం సాయంత్రం 7.30కి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
రియోలో చాలా మంది భారతీయ క్రీడాకారులు విఫలమైన ఒక విషయంలో సింధు సఫలమైంది. అదే, ఒత్తిడిని జయించడం. వంద కోట్ల మంది భారతీయులు తనపై ఆశలు పెట్టుకున్నారని సింధుకు తెలుసు. గెలిస్తే అంత మందీ జేజేలు పలుకుతారనీ తెలుసు. ఓడితే వంద కోట్ల మందీ నిరాశ పడతారనీ తెలుసు. ఇదే అత్యంత ఒత్తిడి కలిగించే విషయం. మ్యాచ్ ప్రారంభంలో ప్రత్యర్థి నుంచి సింధు గట్టి పోటీ ఎదుర్కొంది. అయినా ఆత్మవిశ్వాసం సడలకుండా దూకుడుగా ఆడింది.
రెండో గేము మొదటి 10 నిమిషాలుమాత్రం జపాన్ క్రీడాకారిణి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత సీన్ పూర్తిగా రివర్సయింది. సింధు తప్పుల వల్ల 5పాయింట్లు మూటగట్టుకున్న ఓకుహారా, మరో 5 పాయింట్లు కష్ట పడి సాధించింది. అంతే, అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత సింధు దూకుడు పెరిగింది. ప్రత్యర్థిని 10 పాయింట్ల వద్దే నిలబెట్టి మరీ మ్యాచ్ ను నెగ్గింది. బలమైన షాట్లతో, తిరుగులేని స్మాష్ లతో చెలరేగి ఆడింది. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.