ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతీ దాంట్లోనూ దోచుకోమని అన్నట్లుగా వ్యవహరించిన గత పాలకులు..కనీసం దొరికిపోతామని అనుకోలేదు. 30 ఏళ్లు మాదే అధికారం అనుకుని కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరించారు.
నేరుగానే కమిషన్లు పుచ్చుకున్నారు. ఈ వ్యవహారాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ ఖనిజం దోపిడీ వ్యవహారంలో తాడేపల్లి లింక్ వెలుగులోకి వస్తోంది. అక్కడ అడ్డంగా దోచుకోండి కానీ.. నెలకు ఇరవై కోట్లు కమిషన్ తాడేపల్లికి పంపండి అనే ఒప్పందం జరిగినట్లుగా తాజాగా వెలుగులోకి వస్తోంది.
క్వార్ట్జ్ ఖనిజం అక్రమ తవ్వకం, అమ్మకం కేసుల్లో ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ వ్యాపారంలో భాగమైన వారిని అరెస్టు చేసి వారి ఆర్థిక లావాదేవీలు బయటకు లాగుతూంటే.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లికి నెలకు ఇరవై కోట్లు చెల్లించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ డబ్బు లావాదేవీలు.. ఎలా జరిగాయి.. ఆ మొత్తం తాడేపల్లికి ఎలా చేరిందన్న అంశం క్లారిటీగా ఉండటంతో తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు.
అనిల్ కుమార్, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇద్దరికీ సరిపడదు. కానీ ఇద్దరూ ఈ క్వార్ట్జ్ దోపిడీలో భాగమయ్యారు. ఎలా చేయగలిగారు అంటే.. అంతా తాడేపల్లి మాయ అంటున్నారు. అసలు వీరిని వాడుకుని మొత్తం తాడేపల్లిలోనే కథ నడిపించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో గత ప్రభుత్వ పెద్దలు నిండా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ క్వార్ట్జ్ దోపిడీ వ్యవహారంలోనూ అధారాలు బయటకు వస్తే.. ఇక తేలడం కష్టం అవుతుంది. వైసీపీలో ఈ వ్యవహారం సంచలనంగా మారనుంది.