“75 ఏళ్లు వచ్చాయని చెప్పి ఎవరైనా వచ్చి శాలువా కప్పితే అది మనకు ఇక సేవలు చాలు” అని చెప్పినట్లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త చర్చకు కారణం అయ్యాయి. అవి మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే ఆరెస్సెస్ వేగంగా స్పందించింది. మోదీకి ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కానీ అంతకు ముందే బీజేపీలో మోదీకి వారసులెవరు అన్న అంశంపై చర్చ కూడా ప్రారంభమయింది. అమిత్ షా నోట కూడా రిటైర్మెంట్ మాట వినిపించింది. కానీ మోదీని రిటైర్మెంట్ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఆయన అనుకున్నప్పుడు మాత్రమే రిటైర్ అవుతారనేది అందరికీ తెలిసిన నిజం.
బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్మెంట్ రూల్
భారతీయ జనతా పార్టీలో ఓ అప్రకటిత రూల్ అమల్లో ఉంది. సీనియర్లు ఎవరైనా 75 ఏళ్ల వరకే రాజకీయాలు చేయాలి. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి. బీజేపీలో మోదీ, అమిత్ షా శకం ప్రారంభమైన తర్వాత మెల్లగా సీనియర్లు అందర్నీ ఈ కారణంగా ఇంటికి పంపేశారు. బీజేపీకి ఓ రూపం తెచ్చిన అద్వానీ, జోషి, ఉమాభారతి లాంటి వాళ్లను కూడా వదల్లేదు. అలాంటి వారంతా మెల్లగా కనుమరుగు అయ్యారు. వెంకయ్యనాయుడును కాస్త ముందుగానే ఉపరాష్ట్రపతి ఇచ్చి పంపేశారు. ఆ పదవి అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారు. ఇటీవల యడ్యూరప్పకూ వర్తింప చేశారు. కానీ ఈ రూల్ మోదీకి వర్తిస్తుందా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తూంటాయి కానీ…బీజేపీలో ఎప్పుడూ అలాంటి చర్చలు జరగవు.. జరగలేవు కూడా.
సెప్టెంబర్ 17కి మోదీకి 75 ఏళ్లు !
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సెప్టెంబర్ 17న 75వ ఏట అడుగుపెడతారు. బీజేపీ రూల్ ప్రకారం 75 పూర్తి అయి 76లోకి అడుగు పెట్టే సరికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలి. కానీ బీజేపీలో నరేంద్రమోదీకి ఎదురు లేదు. ఆయన మాటే శాసనం. ఆయనను శాసించేవారు ఎవరూ లేరు. చివరికి బీజేపీ సిద్ధాంతకర్త అయిన ఆరెస్సెస్ పెద్దలు కూడా మోదీని దిగిపోవాలని చెప్పే సాహసం చేయరు. ఆయన అంత పట్టు సాధించారు. ప్రధాని మోదీ శారీరకంగా ఎంతో ఫిట్ గా ఉంటారు. ఆయనకు వాజ్ పేయి తరహాలోనే కుటుంబం లేదు. పూర్తిగా దేశానికే అంకితమయ్యారు. అందుకే ఆయనకు రిటైర్మెంట్ అనేది ఉండదని బీజేపీ వాదించే అవకాశం ఉంది.
మోదీ అనుకున్నప్పుడే రిటైర్మెంట్
ప్రధాని మోదీ ఇక పదవి చాలు అనుకున్నప్పుడు మాత్రం అందరూ అంగీకరిస్తారు. గతంలో ప్రధాని మోదీ మూడో టర్మ్ పూర్తి అయిన తర్వాత.. వారసుడికి పగ్గాలు ఇచ్చి.. తాను రాష్ట్రపతిగా వెళ్లాలనే ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అదే నిజం అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించి.. ఆయన రాష్ట్రపతిగా వెళ్లవచ్చు. ప్రస్తుతానికి మోదీ తర్వాత బీజేపీలో అమిత్ షాక్ పవర్ ఫుల్. ఆదిత్యనాథ్ కూడా రేసులో ఉంటారు కానీ.. అమిత్ షా తర్వాత ఆయనకు చాన్స్ లభించవచ్చు.
మొత్తంగా.. మోదీ రిటైర్మెంట్ జరిగే చర్చలన్నీ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపవు .. మోదీ అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రిటైర్ అవుతారు.