‘రాధే శ్యామ్’ తొలి గీతం… కాన్సెప్ట్ మొత్తం చెప్పేశారుగా!

రాధేశ్యామ్ నుంచి చిన్న అప్ డేట్ వ‌చ్చినా.. ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఎందుకంటే… అప్‌డేట్లు ఇచ్చే విష‌యంలో యూవీ క్రియేష‌న్స్ మ‌రీ పిసినారిత‌నం చూపిస్తూ వ‌చ్చింది. ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భాల్లో సైతం అభిమానుల‌కు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేటూ ఇవ్వ‌లేదు. ఇప్పుడు సినిమా మొత్తం పూర్త‌య్యింది. సంక్రాంతికి వ‌చ్చేస్తోంది. అందుకే అప్ డేట్లు వ‌రుస క‌డుతున్నాయి. కొద్ది సేప‌టి క్రితం రాధే శ్యామ్ నుంచి తొలి పాట కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. `ఎవ‌రో వీరెవ‌రో క‌ల‌వ‌ని ప్రేమికులా… ఎవ‌రో వీరెవ‌రో.. విడిపోని యాత్రికులా` అంటూ సాగే ఈ గీతాన్ని కె.కె. రాశారు. యువ‌న్ శంక‌ర్ రాజా, హ‌రిణి ఆల‌పించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ స్వ‌ర ప‌రిచారు. ఇదో క్లాస్‌మెలోడీ. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఈ పాట‌లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. సాధార‌ణంగా లిరిక‌ల్ వీడియో అంటే, సినిమాలోని బిట్లు, లేదంటే వ‌ర్కింగ్ స్టిల్స్, ఇంకాలేదంటే, సినిమాలోని పాట‌నే చూపిస్తూ… డిజైన్ చేస్తారు. కానీ రాధే శ్యామ్ మాత్రం కొత్త పంథాలో వెళ్లింది. యానిమేష‌న్ రూపంలో ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల‌ను సృష్టించింది. ఈ క‌థ‌నీ చూపించే ప్ర‌య‌త్నం చేసింది. హ‌స్త సాముద్రికం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ప్రేమికుల్ని విధి ఎలా క‌లిపింది, ఎలా విడ‌దీసింది? అనేదే క‌థ‌. అదే… లిరిక‌ల్ వీడియోలోనూ చూపించారు. పంచ భూతాలు అనే కాన్సెప్ట్ లో ఈ పాట‌ని డిజైన్ చేసిన‌ట్టు అనిపించింది. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం.. ఇవ‌న్నీ ఈ ప్రేమ జంట‌కు ఎలాంటి ఆటంకాలు క‌లిగించాయో.. చూపించారు. పాట స్లో గా ఉన్నా, క‌థ‌లో భాగంగా వ‌స్తుంద‌నిపిస్తోంది. పాడిన విధానం చాలా స్టైలీష్ గా ఉంది. మొత్తానికి.. రాధే శ్యామ్ మ్యూజిక‌ల్ ఫెస్టివ‌ల్ కి ఇది మంచి బిగినింగే. ఇక మీద‌ట‌… వారం వారం ఈ సినిమా నుంచి ఒక్కో పాట వదిలేలా చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.