ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సాక్షి మీడియా గ్రూపుపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సాక్షి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వై.ఎస్. భారతీరెడ్డితో పాటు సంస్థ ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్ల పేర్లను ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
తప్పుడు కథనాలతో తనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే సదరు కథనాలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించని పక్షంలో సివిల్ , క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ నోటీసుల్లో పరువు నష్టం కింద రూ. కోటి చెల్లించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేయడం గమనార్హం. ఒకవేళ ఆ పరిహారం చెల్లిస్తే, ఆ మొత్తాన్ని అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు విరాళంగా అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు. సాక్షి మీడియాలో బరి తెగించి చేస్తున్న అసత్యప్రచారాలను ఇక ఉపేక్షించకూడదని చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.