రాహుల్ గాంధీ లాంటి నేత ప్రజానాయకుడు అయిన శివకుమార్ రాజకీయ జీవితాన్ని నిర్దేశించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్‌లో జరిగే వింతల్లో ఒకటి. రెండున్నర ఏళ్ల కిందట ఇచ్చిన హామీని అమలు చేయాలని డీకే శివకుమార్ రాహుల్‌పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ రాహుల్ మాత్రం పార్టీలు చేసుకుంటున్నారు కానీ.. శివకుమార్ కు ఏమీ చెప్పడం లేదు. అనిశ్చితి అలా సాగిపోతోంది. చివరికి శివకుమార్ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలియగానే.. వెంటనే రాహుల్ రంగంలోకి దిగిపోయారు. ఒకటో తేదీ వరకూ ఆగాలని.. నిర్ణయం తీసుకుంటామని సంకేతాలు పంపారు.
క్రమంగా ఒత్తిడి పెంచుతున్న డీకే
గత వారం రోజులుగా 15 మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్ఠానంతో మాట్లాడారు. వారి అభిప్రాయం 2023లో జరిగిన మాట ప్రకారం ఇప్పుడు డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలి అనేదే. ఈ విషయం మీడియాలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తానని అంటున్నారు. కానీ ఐదేళ్ల పాటు తానే ఉంటానని కూడా అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయంపై బహిరంగంగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది అని చెబుతున్నారు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదన్న పద్దతిలో శివకుమార్
ఇప్పుడు సీఎం పదవి రాకపోతే ఇంకెప్పుడూ రాదన్న భావనలో శివకుమార్ ఉన్నారు. అదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దలకు నేరుగా చెబుతున్నట్లుగా తెలుస్ోతంది. కర్ణాటకకే చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ఏమీ చేయలేకపోతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో జరిగే సమావేశాల తర్వాతే స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైతే రాష్ట్రంలో ఈ చర్చే హాట్ టాపిక్‌గా మారింది.
డీకేకే ఎక్కువ చాన్స్
డీకే శివకుమార్ కు అన్యాయం జరిగిందని ప్రజల్లో ఓ భావన ఉంది. పార్టీ కార్యకర్తల్లోనూ ఉంది. సిద్ధరామయ్య కొనసాగింపు విషయంలో హైకమాండ్ కూడా ఆలోచిస్తోంది. అయనను తప్పిస్తే.. ఎవర్ని నియమించాలన్న ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తూండటమే వారి వ్యూహాత్మక లేమికి నిదర్శనం. మొత్తంగా డిసెంబర్ ఒకటో తేదీన శివకుమార్‌కు గుడ్ న్యూస్ వినిపించకపోతే.. కాంగ్రెస్ పార్టీలో మరింతగా కల్లోలం రేగే అవకాశాలు ఉన్నాయి.