కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కేవలం వ్యూహాలే కాదు, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ కూడా అవసరమని చెప్పి.. తనకు ప్రావీణ్యం ఉన్న జపాన్ మార్షల్ ఆర్ట్ జియుజిట్సు మెళకువలను అక్కడి ప్రతినిధులకు స్వయంగా నేర్పించారు. ప్రత్యర్థి బలాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం ఎలా పాటించాలి అనే అంశాలను మార్షల్ ఆర్ట్స్ ద్వారా వివరించారు.
రాజకీయాలు చెబుతారనుకున్న డీసీసీ అధ్యక్షులకు రాహుల్ చెప్పిన క్లాస్ కాస్త వింతగా అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో మార్షల్ ఆర్ట్స్‌ను అన్వయించుకోవాలని, తద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని సలహా ఇచ్చారు. భయంపై విజయం సాధించడానికి, అహింసాయుత మార్గంలో సంఘర్షణలను పరిష్కరించుకోవడానికి ఈ విద్య ఎంతో దోహదపడుతుందని సలహా ఇచ్చారు.
ఈ ప్రాక్టీస్ తర్వాత మోదీపై ఘాటు విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజలపై ఒకరకమైన గ్రిప్, చోక్ వ్యూహాలు ప్రయోగిస్తోందని ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని చెప్పారు. ఈ అదృశ్య రాజకీయ పట్టుల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తీరు వల్ల దేశానికి యుద్ధ ముప్పు పొంచి ఉందన్నారు. డీసీసీ అధ్యక్షులు ఎప్పుడూ నేల మీద ఉండాలని , ప్రజలతో నిరంతరం కనెక్షన్ కలిగి ఉండాలని సూచించారు. అహంకారం వీడి, క్రమశిక్షణతో కూడిన పోరాటం చేస్తేనే రాజకీయాల్లో విజయం సాధ్యమని చెప్పారు.
సీరియస్ గా రాజకీయాలు చెబుతారని అనుకున్నా.. చివరికి ఆయన అన్నింటికీ మార్షల్ ఆర్ట్స్ తో ముడిపెట్టి ప్రాక్టీస్ చేయించడం డీసీసీ అధ్యక్షుల ఒళ్లు నొప్పులకు కారణం అయింది.
