మాకు, మాకు మధ్య బోలెడుంటాయి. అవన్నీ మేమే తేల్చుకుంటాం. మా విషయంలో మీకు అనవసరం అని .. ఓ కుటుంబం ఇతరుల జోక్యంపై అనుకుంటుంది. దేశం కూడా అలాగే అనుకోవాలి. కుటుంబంలోని వ్యక్తో.. దేశంలోని కీలక వ్యక్తో తమ పంచాయతీని బయటకు తీసుకెళ్లి వాళ్ల ముందు పెడితే పోయేది ఆ కుటుంబం.. ఆ దేశం పరువే. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పని గట్టుకుని విదేశాలకు పోయి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కించ పరుస్తున్నారు. ఎన్ని సార్లు విమర్శలు వచ్చినా ఆయనతగ్గడంలేదు.
భారత ప్రజాస్వామ్యంపై కొలంబియాలో వ్యతిరేక వ్యాఖ్యలు
తాజాగా రాహుల్ గాంధీ కొలంబియాలో EIA యూనివర్శిటీలో విద్యార్థులతో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తీవ్రంగా దాడి జరుగుతోందని చెప్పుకొచ్చారు. భారతదేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్యంపై దాడి అనేది అతిపెద్ద సవాలని.. అన్నారు. దేశంలో పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారాయని అనేశారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. ప్రజలు వరుసగా ఓడించడం .. తమను గెలిపించకపోవడం .. ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.
దేశంలో ఈసీపై తప్పుడు ప్రచారం – బయటా అదే పని
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా భూమి భారతిని అన్నారు పెద్దలు. దేశంలో ఆయన ఓట్ల చోరీ అంటూ… ఎన్నికల వ్యవస్థపై అపోహలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు చోరీ ఎక్కడ జరిగిందో బయట పెట్టడం లేదు. బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి.. అరవై లక్షలకుపైగా ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. అందులో తప్పులు జరిగితే ఆ విషయాన్ని బయట పెట్టాల్సింది. ఇప్పటి వరకూ ఆ విషయం చెప్పలేదు. కానీ విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల ముందు.. ఇతర దేశాల ముందు భారత్ పై చెడు అభిప్రాయం ఏర్పాటు చేసేందుకు ఆయన ఏ మాత్రం వెనుకాడటం లేదు.
ప్రజాస్వామ్యంపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీనే
చరిత్ర చూసుకుంటే దేశ ప్రజాస్వామ్యం అంత ఘోరంగా దాడికి గురయింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఎమర్జెన్సీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం వరకూ గుర్తు చేసుకుంటే.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పునాదులను ఎప్పటికప్పుడు బలహీనం చేయాలని చూసిందని అర్థమవుతుంది. కానీ ప్రజాస్వామ్యం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉంది. అయినా కాంగ్రెస్ వారసుడు రాహుల్ మరో విధంగా ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.