రాహుల్ గాంధీ రాజకీయాలు దేశ ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. తమ ఓటములకు, చేతకాని తనానికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని చెప్పి.. తాము సమర్థులమని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల విశ్వసనీయత దెబ్బతీసి.. ఏదో చేయాలనుకుంటున్నారు. ఎన్నికలపై నమ్మకం కోల్పోయేలా పోరాటం చేస్తే చివరికి ఆయన గెలిచినా కూడా ఎవరూ నమ్మరు. గెలుస్తారన్న దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇండియాలో జెన్ Z ఉద్యమం వస్తుందని ట్వీట్లలో కలలు కంటున్నారు.
దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన పార్టీగా కాంగ్రెస్ కనీస బాధ్యతగా ఉండటం లేదు. తమకు అధికారం లేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని హననం చేసే గత సంప్రదాయాలను ఇప్పుడూ పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టం వచ్చినట్లుగా కూల్చివేయడం, ముఖ్యమంత్రుల్ని మార్చేయడం వంటి పోకడలతో మొత్తంగా కాంగ్రెస్ పార్టీఅంటే.. కుటుంబ పార్టీ అన్నట్లుగా మార్చుకుని.. కరిగిపోతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా దాన్ని వదిలి పెట్టడం లేదు. రాజకీయంగా పోరాటం చేయకుండా.. ఓట్ల చోరీ అంటూ.. ఎన్నికల ప్రక్రియ మీదే అనుమానాలు రేకెత్తిస్తున్నారు.
యువత తిరుగుబాటు చేస్తే తాము పెత్తనం చేయాలనుకుంటున్నారు. కానీ దేశం ఇప్పుడు అత్యున్నత స్థితిలో ఉంది. అభివృద్ధి పథంలో ఉంది. అవినీతి .. కాంగ్రెస్ కూటమి పార్టీ పదేళ్ల కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. దానికే తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉంది. దేశ యువత ఇప్పుడు ఎక్కువ అవకాశాలను అందుకుంటున్నారు. రాహుల్ గాంధీకి మాత్రమే సమస్యలు ఉన్నాయి. అధికారం తన జన్మహక్కు అని ప్రజలు తిరుగుబాటు చేసి తనను ప్రధానిని చేయాలని అనుకుంటున్నారేమో కానీ.. భారత ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ఇలాంటి ఆశలు పెట్టుకుంటే ఆయన ఎప్పటికీ..దేశ ప్రజల అభిమానాన్ని పొందలేరన్నది జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతుంది.
ఎలాగూ ఎన్నికల్లో గెలవలేమని ఆయనకు అర్థమైనట్లుగా ఉంది. అందుకే నేపాల్ నుంచి ఆశల్ని మోసుకొచ్చుకుంటున్నారు. ఒకప్పుడు సమర్థించిన వారు కూడా ఇప్పుడు ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారంటే.. ఎంత వేగంగా వెనక్కి వెళ్తున్నారో ఆయనే తెలుసుకోవాల్సి ఉంది.
