త్వరలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. మూడేళ్ళ క్రితమే అంటే 2013లోనే ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపడతారని అందరూ భావించినప్పటికీ, ఆ మరుసటి సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలున్నందున ఆయనకి ఉపాధ్యక్ష పదవితోనే సరిపెట్టారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాలకు ముందు, ఆయన పార్టీ పగ్గాలు చేపట్టాలని తహతహాలాడారు కానీ పార్టీలో సీనియర్ నేతలు ఆయన నాయకత్వ లక్షణాలు ప్రశ్నించడంతో ఆయన పార్టీపై అలిగి మూడు నెలలు శలవు మీద విదేశాలు వెళ్లిపోయారు. మళ్ళీ తిరిగివచ్చిన తరువాత గత జూన్ నెలలో ఆయనకీ పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తారని అందరూ భావించినప్పటికీ, మళ్ళీ సోనియా గాంధీకే మరో ఏడాదిపాటు పార్టీ భాద్యతలు అప్పగించాలని నిర్ణయం అయింది.
ఆమె పదవీకాలం ఈ నెలలో పూర్తికాబోతోంది కనుక ఈసారి తప్పకుండా రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడే అప్పగించినట్లయితే, వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ముందుండి నడిపించి తన శక్తి సమార్ధ్యాలు నిరూపించుకోగలుగుతారని పార్టీలో సీనియర్ నేతలు కొందరు సలహా ఇవ్వడంతో సోనియాగాంధీ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే సోనియాగాంధీ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించినా, పార్టీకి ఆమె సేవలు కొనసాగిస్తూనే ఉంటారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ప్రియాంకా గాంధిని ప్రత్యక్ష రాజకీయాలలోకి రప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తునందున ఆమె అంగీకరిస్తే రాహుల్ గాంధీ ఖాళీ చేస్తున్న ఉపాధ్యక్ష పదవిలో ఆమెను నియమించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడితే, అది దేశ రాజకీయాలలో సంచలనమే అవుతుంది. ఆయన బాధ్యతలు చేపడితే పార్టీలో సమూలంగా ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.