ఎన్నికల సంఘంపై యుద్ధం చేస్తున్న రాహుల్ గాంధీ కొత్తగా ప్రెస్‌మీట్ పెట్టి అణుబాంబు లాంటి సాక్ష్యాలను బయట పెట్టారు.అయితే ఇంకా ఉన్నాయని చెప్పారు. శాంపిల్ గా బయట పెట్టిన అంశాలు ఏంటంటే.. మహదేవ్ పురా అనే పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు అక్రమంగా చేర్చారని చెప్పుకొచ్చారు. తాము అక్కడి జాబితాను తీసుకుని నిశిత పరిశీలన చేస్తే ఇది బయటపడిందంటున్నారు. ఈ మహదేవ్ పురా ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
అయినా లక్ష ఓట్ల మాయాజాలంతో అక్కడి సీట్లు గెలిచారని .. హర్యానా, మహారాష్ట్రలోనూ అలాంటి అనుమానాలు ఉన్నాయన్నారు.వీటిపై పరిశీలన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంకెలు చెప్పారు కానీ.. వీటికి ఆధారాలేంటి అనే డౌట్ వస్తుంది. వాటికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఈసీ ఆధారాలను ధ్వంసం చేసిందని ఆరోపించారు. తమకు డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదంటున్నారు. అదే సమయంలో సీసీ ఫుటేజీని ధ్వంసం చేసిందని ఆరోపిస్తున్నారు. అంటే.. రికార్డెడ్ సాక్ష్యాలు లేవన్నమాట.
ప్రెస్ మీట్ లో రాహుల్ .. బీజేపీకి 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి 25 సీట్లు కావాల్సి వస్తే వాటిని ఈసీ దొంగిలించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ 33,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో 25 సీట్లు గెలుచుకుందని అవన్నీ ఈసీ అక్రమాలు చేసినవేనని చెప్పుకొచ్చారు. నకిలీ ఓటర్లు , నకిలీ చిరునామాలను ఎన్నికల రోల్స్‌లో చేర్చారని ఆరోపించారు. 2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నుంచి ఈ అనుమానాలు మొదలై, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధృవీకరణ అయినట్లు చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ ఇంతకు ముందు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడటం లేదు. ఓటర్ల జాబితా అక్రమాలంటున్నారు. అయితే మహదేవ్ పురాలో ఉన్నాయంటున్న అక్రమ ఓట్ల ఆధారాలను ఇవ్వాలని కర్ణాటక సీఈవో రాహుల్ కు లేఖ రాశారు.