కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ రెడ్డికి దూరం పెరిగిందని సంతోషంలాంటి వార్తల్ని నిరంతరం వండి వారుస్తూ స్వయం సంతృప్తి పడుతున్న వారికి కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే ఇది. రాహుల్ గాంధీ .. రేవంత్ ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారమే రావాల్సి ఉన్నా కశ్మీర్ పర్యటనకు వెళ్లడంతో ఒక రోజు ఆలస్యంగా వచ్చారు. రాహుల్ రాకపోతే.. రేవంత్ పై ఎంత కోపం ఉంటే ఆయన రాలేదో కథలు కథలుగా చెప్పడానికి కొంత మంది రెడీ అయిపోయారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి.
రాహుల్ గాంధీ, రేవంత్ మధ్య ప్రత్యేక బాండింగ్ ఉంది. అది భారత్ సమ్మిట్ లో ప్రత్యేకంగా కనిపించింది. రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నారని అందుకే హైకమాండ్ ఆయనను కలవడం లేదని కొంత మంది గట్టిగా నమ్ముతున్నారో నమ్మించాలని ప్రయత్నిస్తున్నారో కానీ.. జోరుగా సాగిన ప్రచారాలన్నింటికీ చెక్ పడినట్లయింది. ఇప్పుడు కొత్త పద్దతిలో ఏమైనా ప్రచారం చేసుకుంటారో కానీ.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ హైకమాండ్ మధ్య గ్యాప్ అనేది ఉండదని తేలిపోయింది.
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎలా చేయాలో తెలుసు. అందుకే ఆయన తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి అయ్యారు . అయితే కాంగ్రెస్ పై లేనిపోని అభిమానం చూపిస్తూ రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఏదో రాజకీయం చేయాలని అనుకున్నారు కానీ .. ఎక్కడికక్కడ తేలిపోతున్నారు.