బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కూడా చేశారు. 70 లక్షల ఓట్లను తొలగించారు. వారి వివరాలను వెల్లడించారు. ఎందుకు తీసేశారో వివరించారు. ఈ 70 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ నిరూపించి.. ఎన్నికల సంఘాన్ని ప్రజల ముందు పెట్టాల్సి ఉంది. కానీ ఆయన ఎక్కడ ఉన్నారు?. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబులు, పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేస్తానని హడావుడి చేశారు. కానీ అసలు ఓటర్ల జాబితాలో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో కనిపెట్టి కనీస ఆరోపణలు చేయలేకపోయారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ఓటు చోరీనా ?
రాహుల్ గాంధీ రెండుప్రెస్ మీట్లు పెట్టి రెండు బాంబులేశారు. ఆ రెండింటిలోనూ ఆయన కర్ణాటకకు చెందిన ఓటర్ల జాబితాల్లోని లోపాలను బయట పెట్టారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాము గెలుస్తామని సర్వేలు చెప్పినా ఓడిపోయిన హర్యానాలో లేదా మహారాష్ట్రలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఆయన బయట పెట్టి ఉంటే మరింత ఎఫెక్టివ్ గా ఉండేది. కానీ పట్టించుకోలేదు. అదే సమయంలో బీహార్ లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణను ఏసీ చేపట్టింది. అనర్హులైన ఓట్లను తొలగించింది.కానీ ఎక్కడైనా ఆయన పోరాటానికి సాక్ష్యాలూ చూపించాల్సింది.
బీహార్లో ఓడిపోయాక ఓట్ల చోరీ అంటే ఏం ప్రయోజనం ?
బీహార్ ఇప్పుడు ఇండీ కూటమికి అత్యంత కీలకం. వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. తమ నిర్వాకంతో తేజస్వీని కూడా ఓడిస్తున్నారు. ఇప్పుడు లాలూ పార్టీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పేరుతో బీహార్ లో రాజకీయం చేశారు. టాపిక్ ను ఓట్ల చోరీ వైపు మార్చారు. కానీ ఫలానా చోట్ల ఓట్లు చోరీ అయ్యాయని నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా ఓట్ల చోరీ లేకుండా పోయింది. రేపు ఎన్నికల్లో ఓడిపోయాక .. బీహార్ లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణలు చేస్తే ఏం ప్రయోజనం ?. ఇప్పుడే నిరూపిస్తే.. కదా ప్రయోజనం ఉండేది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు ఈసీ నిర్ణయం
రాహుల్ గాంధీ తనపై చేస్తున్న రాజకీయాన్ని ఎన్నికల సంఘం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న.. ఓట్ల చోరీ అంటే.. ఓటర్ జాబితాలోని లోపాలను సవరించడం.. వాటిని పూర్తి చేయనున్నారు. రాహుల్ గాందీ ఆయుధం కూడా.. అంతటితో నిర్వీర్యం అయిపోతుంది. బీజేపీపై పోరాడాల్సిన ఆయన ఎన్నికల సంఘంపై పోరాడి.. ఓటమిని కొనితెచ్చుకున్నట్లవుతోంది.