హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి రోహిత్ వేముల చట్టం నినాదాన్ని తెరపైకి తెచ్చారు. విద్యాసంస్థల్లో దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులపై జరుగుతున్న వివక్షను అరికట్టడానికి ఈ చట్టం తక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే, 2016లో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపినప్పుడు, స్వయంగా వర్సిటీకి వచ్చి పోరాటంలో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత కూడా కేవలం డిమాండ్లు, లేఖలకే పరిమితం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా దళితుల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకే ఈ అంశాన్ని మళ్లీ వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వంటి అత్యంత కఠినమైన చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. సమస్య చట్టాల కొరత కాదు, ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయడంలోనే ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ రోహిత్ వేముల చట్టం ఇంకా కార్యరూపం దాల్చలేదు.
కర్ణాటక ప్రభుత్వం గతంలోనే దీనిపై హామీ ఇచ్చినా, కేబినెట్ స్థాయిలోనే ఈ బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉంది. తెలంగాణ సర్కార్ ఇంకా ప్రిపరేషన్ కూడా ప్రారంభించలేదు. పదేళ్ల క్రితం రాజకీయ లబ్ధి కోసం వాడిన సెంటిమెంట్‌ను, ఇప్పుడు మళ్లీ పిలుపుల రూపంలో ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో వచ్చే మార్పు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యాసంస్థల్లో రాజకీయాల జోక్యం తగ్గించి, విద్యార్థులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టకుండా, కేవలం కొత్త చట్టాల పేరుతో కాలయాపన చేయడం వల్ల దళిత యువతకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.