హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన OG కాన్సర్ట్ పై వరుణుడు నీళ్లు చల్లాడు. చాలా సంబరంగా జరుగుతుందనుకొన్న ఈ ఈవెంట్ హడావుడిగా ముగిసిపోయింది. పవన్ కల్యాణ్ తప్ప.. ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
సాయింత్రం 4 గంటల నుంచే ఎల్ బీ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈవెంట్ మొదలవుతుందనగా చినుకులు పలకరించాయి. అవి క్రమంగా పెద్దవ్వడంతో కార్యక్రమం సజావుగా సాగలేదు. తమన్ ఒకట్రెండు పాటలు పాడడం, పవన్ కల్యాణ్ ఓజీ గెటప్ లోనే స్టేజీమీదకు రావడం, వర్షంలో కూడా కాసేపు మాట్లాడడం ఊరట ఇచ్చే విషయాలు. వర్షం పడకుండా ఉండి ఉంటే.. ఈ ఈవెంట్ నిజంగానే న భూతో.. అనే రీతిలో సాగేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిజానికి ఓజీ ఈవెంట్ కు వర్షం నుంచి ముప్పు ఉందని చిత్రబృందానికి తెలుసు. ఓ దశలో శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామనుకొన్నారు. కానీ చివరి క్షణాల్లో ఎందుకో రిస్క్ తీసుకొన్నారు. ఆఖరికి… ఓజీ ట్రైలర్ ని కూడా చూపించలేకపోయారు. ఉదయం 10 గంటలకే ఓజీ ట్రైలర్ వస్తుంని చెప్పారు. కానీ వాయిదా పడింది. ఈవెంట్ లో కచ్చితంగా ట్రైలర్ చూస్తామని అభిమానులు భావించారు. కానీ డీఐకి సంబంధించిన పనులు అవ్వకపోవడం వల్ల ట్రైలర్ ప్రదర్శించలేకపోయారు.
‘నా అభిమానులకు డీఐ లేకపోయినా ఫర్వాలేదు.. ఎలాగైనా చూపించాల్సిందే..’ అని పవన్ కూడా పట్టుపట్టారు. కానీ సాధ్యం కాలేకపోయింది. రేపు ఉదయం ట్రైలర్ బయటకు వచ్చే అవకాశం ఉంది.


