గవర్నర్ నివాసాలకు ఉన్న రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్‌గా మార్చారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్ల నివాసాలకు రాజ్ నివాస్ అని ఉండేది.. ఆ పేరును లోక్ నివాస్ గా మార్చారు. అన్ని రాష్ట్రాల్లో మారుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మారిపోయాయి. ఈ పేర్లు మార్చడానికి కేంద్రం తన కారణాలు తాను చెబుతోంది.
బ్రిటిష్ నాటి పేరు రాజ్ భవన్
రాజ్ అనే పదం బ్రిటిష్ కాలంలోని రాజులు, వాళ్ల పాలనకు సంబంధించినది. ఇది కలోనియల్ మర్యాదలను గుర్తు చేస్తుంది. భారతదేశం స్వాతంత్ర్యానంతరం ఈ పేర్లను మార్చలేదు. అందుకే ఇప్పుడు మార్చడం ద్వారా స్వదేశీయతను ప్రోత్సహించాలని కేంద్రంనిర్ణయించింది. భారత రాజ్యాంగ ప్రస్తావన “వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా తో మొదలవుతుంది. లోక్ అనే పదం ద్వారా ప్రజలు సర్వోన్నతులని లోక్ భవన్ కేవలం పేరు మార్పు కాదు, ప్రజల భావనలు, ఆకాంక్షల చిహ్నమని చెబుతోంది
పేరు మారిస్తే విధానాలు మారిపోతాయా?
కారణం ఏదైనా మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేర్ల మార్పుల గురించి ఎవరూ ఆలోచించలేదు. రాజ్ భవన్ అంటే.. గవర్నర్ నివాసం అనుకుంటున్నారు కానీ.. దాని వెనుక కలోనియల్ బానిసత్వం ఉందని ఎవరికీ తెలియదు.తరాలు మారిపోయాయి. అలాంటి అర్థం ఉన్నా.. ప్రజాస్వామ్యంలో ఎవరూ పాటించరు. కానీ గవర్నర్లు మాత్రం గీత దాటిపోతున్నారు . రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే సర్వాధికారం. గవర్నర్ పేరు మీద ప్రభుత్వం నడిచినంత మాత్రాన ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కానీ కొంత మంది గవర్నర్లు తనదే ప్రభుత్వం అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉంటే వాటికి గవర్నర్లు చుక్కలు చూపిస్తారు. అదే పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉంటే మాత్రం గవర్నర్ ఉనికి కూడా కనిపించదు. ఇలాంటి రాజకీయాలు రాజ్ భవన్ వేదికగా జరుగుతాయి. పేరు మార్పు వల్ల మార్పేం రాదు.
గవర్నర్ వ్యవస్థ కేవలం స్టాంప్
భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ కేవలం స్టాంప్. అసలు అవసరం లేదన్న అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రంలో ఉన్న పార్టీలకు గవర్నర్లు ఆయుధాలుగా మారుతున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నియమించి గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్ర అనుకూల ప్రభుత్వాలు లేకపోతే స్వయం పాలన చేస్తారు. రాజ్యాంగంలో గవర్నర్లకు ఉన్న విధులు, హక్కుల గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలుసు. తప్పు చేస్తున్నారని గవర్నర్లకూ తెలుసు. కానీ వ్యవస్థల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకునే అలవాటు ఉన్న రాజకీయం కారణంగా వారు అలా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే ఉన్నారు. పేరు మార్పుతో వ్యవస్థ పునీతం కాదు.