ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి కి ఏపీ హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 25న అరెస్ట్ అయిన ఆయన, అప్పటి నుంచి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా.. సుమారు 11 నెలల తర్వాత ఆయనకు జైలు నుంచి విముక్తి లభించింది.
రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు గతంలో పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, కుంభకోణం తీవ్రత దృష్ట్యా కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. అయితే, తాజా విచారణలో ఆయన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. రాజ్ కేసిరెడ్డితో పాటు ఇదే కేసులో ఉన్న మరో నిందితుడు రోనక్ కుమార్‌కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ మంజూరు చేస్తూనే హైకోర్టు కొన్ని కీలక షరతులను విధించింది. నిందితులు తమ పాస్‌పోర్టులను కోర్టులో అప్పగించాలని, అనుమతి లేకుండా రాష్ట్రం దాటి వెళ్లకూడదని ఆదేశించింది. అలాగే, ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని, సాక్షులను బెదిరించకూడదని హెచ్చరించింది. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ పేరుతో భారీగా అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలపై సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణానికి ఆయనే ప్రధాన సూత్రధారి అని, హవాలా మార్గంలో నిధులు మళ్లించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో కఠిన వ్యాఖ్యలు చేస్తూ ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు ఆరోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకున్నారు.
