వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు , మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గురువారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషన్ను కొట్టి వేయడానికి సిద్ధమైన తరుణంలో కోర్టు వైఖరిని గమనించిన నిందితుడి తరపు న్యాయవాదులు, తమ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలపడంతో ధర్మాసనం అందుకు అనుమతించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం రాజ్ కేసిరెడ్డి పాత్రపై అత్యంత కీలకమైన , ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రాజ్ కేసిరెడ్డి కేవలం సలహాదారు మాత్రమేనని ఆయన తరపు లాయర్ వాదించారు. అయితే మీరు కేవలం సలహాదారు మాత్రమే కాదు, ఈ భారీ మద్యం కుంభకోణానికి మీరే ప్రధాన ఆర్కిటెక్ట్. నిర్ణయాధికారం ఉన్న వ్యక్తుల ప్రోద్భలం లేకుండా అధికారులు ఇంతటి భారీ అవినీతికి పాల్పడే అవకాశం లేదు అని సీజేఐ వ్యాఖ్యానించారు.
రూ. 750 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్న షెల్ కంపెనీలతో రాజ్ కేసిరెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయని, ఇటువంటి ఆర్థిక నేరాల్లో పది నెలల జైలు శిక్ష చాలా తక్కువని కోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున ఇతర నిందితులతో కేసిరెడ్డిని పోల్చలేమని ధర్మాసనం పేర్కొంది.
లిక్కర్ పాలసీని ప్రభావితం చేసి కొన్ని బ్రాండ్లకు లబ్ధి చేకూర్చడం ద్వారా నెలకు రూ. 50 నుంచి 60 కోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు కేసిరెడ్డిపై బలంగా ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ కుంభకోణం మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, దర్యాప్తు సంస్థల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో రాజ్ కేసిరెడ్డి మరికొంత కాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.