టాలెంట్‌తో విజయాలొస్తాయి. విజయాలే అవకాశాలకు దార్లు చూపిస్తాయి. అయితే ప్రతిభ, అవకాశాలు ఎన్నున్నా.. సరైన ప్రణాళికలు కూడా అవసరమే. ఈ విషయంలో తప్పు చేస్తే… తప్పటడుగులు వేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ ప్రతిభ, అతను అందుకొన్న విజయాల్ని తక్కువ అంచనా వేయలేం. కానీ ప్రణాళికా పరంగా రాజ్ తరుణ్ తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టు అర్థం అవుతోంది. వరుసగా మూడు హిట్లు కొట్టి.. దూకుడుమీద ఉన్నప్పుడు సీతమ్మ అందాలు – రామయ్య సిత్రాలు అంటూ పరమ రొటీన్ కథని ఎంచుకొని తప్పు చేశాడు. కాస్త పేరున్న దర్శకులు రాజ్ తరుణ్‌తో సినిమాలు చేద్దామని ముందుకొచ్చినా. తన స్నేహితుడికి అవకాశం ఇచ్చి ఘోరమైన తప్పు చేశాడు. ఆసినిమా పల్టీకొట్టింది. ఇప్పుడు `రాజుగాడు` సినిమా విషయంలోనూ అదే తప్పు చేస్తున్నాడని తెలుస్తోంది.
సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంజనకు ఇదే తొలి సినిమా. ఆమె చెప్పిన లైన్ విని స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్దం కాకపోయినా.. ఓకే అనేశాడట. సగం స్క్రిప్టు తోనే సినిమా మొదలైపోయింది. అయితే.. ఇప్పుడు సెకండాఫ్ లేకపోవడం, అది పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిందట. కేవలం ఓ అరడజను సన్నివేశాల్ని నమ్ముకొని రాజ్ తరుణ్ ఇలా ఎలా బరిలోకి దిగిపోయాడంటూ.. కామెంట్స్ వినిపిస్తున్నాయిప్పుడు. షూటింగ్ ఎక్కడికక్కడ ఆపేసి, ఇప్పుడు సెకండాఫ్ రాయించే పనిలో పడ్డాడట రాజ్ తరుణ్. సినిమాకి కీలకమైన సెకండాఫ్ లేదన్న విషయం రాజ్ తరుణ్‌కి తెలీదా?? ఇంత గుడ్డిగా ఓ సినిమా ఎలా మొదలెడతాడు?? పైగా ఫస్టాఫ్ కంటెంట్‌లో కూడా చిన్న చిన్న మార్పులు చేయమంటున్నాడట. అంటే ఇప్పటి వరకూ తీసిన సినిమా రీషూట్‌కి వెళ్లాలన్నమాట. ఈడో రకం ఆడో రకం సినిమా తరవాత రాజ్ తరుణ్ సినిమా ఏదీ విడుదల కాలేదు. ఓ వైపు రాజ్ తరుణ్ వయసున్న యంగ్ హీరోలు సినిమాల మీద సినిమాలు వదులుతున్నారు. నాని నుంచి ఈ యేడాది ఏకంగా నాలుగు సినిమాలొచ్చాయి. దానికి కారణం.. పర్ఫెక్ట్ ప్లానింగే. నానికి ఉన్నదీ.. రాజ్ తరుణ్‌కి లేనిదీ ఆ ప్లానింగ్ ఒక్కటే. మరి ఇలాంటి స్వీయ తప్పిదాల నుంచి ఈ కుర్ర హీరో ఎప్పుడు బయటపడతాడో??