రాజ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే ఒకే రాజకీయ వేదిక మీద కనిపించారు. ఇరవై ఏళ్లుగా కలవని వీరు … మరాఠీ నినాదంతో మహారాష్ట్రను ఏకం చేసి మళ్లీ శివసేన పార్టీని పునరుజ్జీవింప చేసుకునే ప్రయత్నంలో ఒకే వేదికపై వచ్చారు. మరాఠీ విజయ్ దివస్ కార్యక్రమానికి హాజరైన సోదరులిద్దరూ వచ్చారు. ఇద్దరి కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి రాజ్ ఠాక్రే తన సతీమణి షర్మిల, కుమారుడు అమిత్ ఠాక్రే, కుమార్తె ఊర్వశితో కలిసి వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా తన కుటుంబంతో వచ్చారు. ఆయన వెంట భార్య రష్మీ, కుమారులు ఆదిత్య, తేజస్ ఉన్నారు.
తమిళనాడులో ఉన్న బాషా వివాదం ఇటీవల మహారాష్ట్రకు పాకింది. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వ్యతిరేకించారు. ఆందోళనకు పిలుపునిచ్చారు. కలిసి పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నారు. థాక్రే సోదరులు కలవడంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందీని మనపై రుద్దే ప్రయోగాన్ని ప్రారంభించారు. మేము దానిని వ్యతిరేకించకపోతే.. వారు ముంబైని మహారాష్ట్ర నుండి వేరు చేస్తారని రాజ్ థాక్రే మండిపడ్డారు.
ఇద్దరూ కలిసిన రోజే.. మరాఠీని నేర్చుకునేదిలేదన్న సుశీల్ కేడియా అనే వ్యాపారవేత్త ఆఫీసు మీద దాడి చేశారు. ముంబైలో మరాఠీ మాట్లాడటం రాని వారిపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపై సీఎం ఫడ్నవీస్ హెచ్చరికలు జారీ చేశారు. మరాఠీ పేరుతో ‘గూండాయిజం’చేస్తే సహించేది లేదన్నారు. అయితే మరాఠీ ప్రజలకు న్యాయం జరగకుంటే గూండాయిజాన్ని చూస్తూనే ఉంటామని ఉద్దవ్ థాక్రే హెచ్చరించారు. . ప్రజల కోసం, భాష కోసం తమని గూండాలు అని పిలిచినా పర్వాలేదన్నారు.
ఇలాంటి ఉద్యమాలను ఎలా నిర్మించాలో రాజ్ థాక్రేకు బాగా తెలుసు. అందుకే వీరిద్దరూ కలవడం .. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.