ప్రజల మధ్య విద్వేషాలు పెంచడమే రాజకీయంగా ఉండే పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలతో తెరపైకి వస్తూనే ఉంటాయి. ప్రాభవం కోల్పోతున్నప్పుడల్లా ఇలాంటివి సృష్టిస్తూనే ఉంటారు. థాక్రే వారసులుగా తెరపైకి వచ్చిన రాజ్ , ఉద్దవ్ .. శివసేనను కాపాడుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ తమ శివసేనను బతికించుకునేందుకు ఇదే తరహా విద్వేష మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సారి వారి టార్గెట్ దక్షిణాదిపై కూడా పడింది.
హటావో లుంగీ బజావో పుంగీ నినాదం
ముంబైలో జరిగిన ఉద్ధవ్ థాకరే శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఉమ్మడి ర్యాలీలో రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముంబై మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ తరపున తమిళనాడుకు చెందిన కె. అన్నామలై వచ్చారు. ఆయనను ఉద్దేశించి ఒక రసమలై తమిళనాడు నుండి వచ్చింది అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా హటావో లుంగీ బజావో పుంగీ అనే నినాదం కూడా బహిరంగసభలో ఇచ్చారు ఇది కేవలం ఒక వ్యక్తిని విమర్శించడం మాత్రమే కాకుండా, దక్షిణాది ప్రజల సంస్కృతిని, వేషధారణను కించపరిచేలా ఉంది.
ముంబై మురాఠీలదేనని ప్రచారం చేయడే లక్ష్యం
దశాబ్దాల క్రితం ముంబైలో ప్రాంతీయవాదాన్ని రగిలించడానికి వాడిన హటావో లుంగీ వంటి పాతకాలపు నినాదాలను మళ్ళీ తెరపైకి తీసుకురావడం ద్వారా రాజ్ థాకరే విభజన రాజకీయాలను ఓ రేంజ్ లో తెరపైకి తెస్తున్నారు. మరాఠీల ఆదరణ చూరగొని తమ శివసేన ఫ్యాన్స్ ను మళ్లీ వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వీరి ప్రాంతీయ వాదానికి కాలం చెల్లింది. హిందూత్వ బ్రాండ్ గానే శివసేన మిగిలింది. అందుకే అంతా షిండేతో పాటు వెళ్లిపోయారు. ఓటర్లు కూడా వెళ్లిపోయారు. ఆ విషయం అన్నదమ్ములు గుర్తించకుండా మళ్లీ ప్రాంతీయ విద్వేషాలతో రెచ్చిపోతున్నారు.
ముంబై దేశ ఆర్థిక రాజధాని – ఇలాంటివి చెల్లుతాయా?
థాకరే సోదరుల రాజకీయ తీరుపై ముంబైలో మరాఠీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ముంబై నగరాభివృద్ధికి సంబంధించి గానీ, మౌలిక సదుపాయాల కల్పన లేదా ఉపాధి అవకాశాల మెరుగుదల గురించి గానీ ఎటువంటి స్పష్టమైన విజన్ థాక్రే సోదరులు ప్రకటించడం లేదు. కానీ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేస్తున్నారు. ముంబై లాంటి అంతర్జాతీయ స్థాయి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రణాళికలు పక్కన పెట్టి, కేవలం భావోద్వేగాలతో పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.
ఉనికి కాపాడుకోవడానికి ఉద్ధవ్, రాజ్ థాకరేలు కలిశారు. కానీ వారిలో మార్పు రాలేదు. అభివృద్ధి అజెండాను కాదని, తిరిగి పాతకాలపు ప్రాంతీయ విద్వేషాల వైపు మళ్ళడంతో ఆ కలయిక ఉపయోగపడుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
