2026లో బాక్సాఫీస్‌ని ముందుగా పలకరించే భారీ చిత్రం ‘రాజాసాబ్’. ఈ సంక్రాంతి హంగామా రాజాసాబ్ తోనే మొదలవుతుంది. ప్రభాస్ సినిమా అంటే అది డిఫాల్ట్ గా పాన్ ఇండియా సినిమానే. పైగా ఇందులో సంజయ్‌దత్ ఉన్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా హారర్, కామెడీ జోనర్. ఈ టైపు సినిమాలకు పాన్ ఇండియా పరంగా క్రేజ్ ఉంటుంది. నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమాని భారీగా విడుదల చేస్తున్నారు. రెండో ట్రైలర్ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని కట్ చేసిందే. అక్కడ ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది కూడా. కానీ.. ఒక్కటే లోటు. `రాజాసాబ్`కి సంబంధించి ఇప్పటి వరకూ నార్త్ లో ప్రమోషనల్ యాక్టివిటీ మొదలవ్వలేదు. రిలీజ్ కి ఇంకా పది రోజుల సమయమే ఉంది. అయినా సరే.. ప్రమోషన్స్ ప్రారంభించలేదు. దాంతో రెబల్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలు ఈ సినిమా కోసం నార్త్ లో పబ్లిసిటీ చేస్తారా? లేదా? అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది పాన్ ఇండియా సినిమా అవునో, కాదో తెలియడం లేదంటూ తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
రాజాసాబ్ కు సంబంధించి హైదరాబాద్‌లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రభాస్ స్పీచ్ ఈ ఈవెంట్ కే హైలెట్ అయ్యింది. ప్రీ రిలీజ్ తరవాత… ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోతున్నాడు. ఇక రాజాసాబ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో ప్రభాస్ కనిపించడు. ఏ ఈవెంట్ చేసినా ప్రభాస్ లేకుండానే. ప్రభాస్ గైర్హాజరితో ఈ ప్రమోషన్స్ కి కళ తీసుకురావడం చాలా కష్టం. పైగా టైమ్ కూడా చాలా తక్కువగా వుంది. పుష్ప టైమ్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియా వ్యాప్తంగా సుడిగాలి ప్రమోషన్ చేశాడు. బన్నీ వెళ్లిన ప్రతీ ఈవెంట్ కీ అనూహ్య స్పందన లభించింది. పుష్ప ఓపెనింగ్స్ కి ఈ ప్రమోషన్స్ బాగా దోహదం చేశాయి. ప్రభాస్ తో కూడా ఇలానే ప్రమోట్ చేయిస్తే బాగుండేది. పాన్ ఇండియా సినిమా తీస్తే సరిపోదు. పాన్ ఇండియా సినిమా అని పోస్టర్ పై ప్రకటించుకొంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా ప్రమోషన్లు చేసి తీరాలి. ఈ విషయంలో `రాజాసాబ్` వెనుకబడి వుంది. తెలుగులో రాజాసాబ్ ని ప్రమోట్ చేయకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సినిమా చూడడానికి ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. నార్త్ లో అలా కాదు. ప్రభాస్ ఉన్నా సరే.. సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాల్సిందే. కనీసం టీమ్ అయినా నార్త్ టూర్ ఒకటి ప్లాన్ చేయాలి. సంజయ్‌దత్ లాంటి స్టార్లని రంగంలోకి దింపాలి. ఈ విషయంలో ఆలస్యం చేస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది.
