ఈ పండగ హడావుడి ‘రాజాసాబ్’తో మొదలు కాబోతోంది. ఈ రాత్రే ప్రీమియర్లు ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదు. అది బయటకు వచ్చేస్తే రేట్లు ఫిక్స్ అవుతాయి. బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఏ క్షణమైనా జీవో రావొచ్చు. ఏపీలో ప్రీమియర్ల రేటు రూ.1000 గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ రూ.290, మల్టీప్లెక్స్ రేటు రూ.375 వరకూ ఉంది. ఈ రేట్లతో భారీ ఓపెనింగ్స్ సాధిస్తే ‘రాజాసాబ్‌కు’ తిరుగు ఉండదు. ఏమాత్రం మంచి టాక్ వచ్చినా ఈ వీకెండ్ విజృంభించడం ఖాయం. తొలి రోజు కనీసం రూ.100 కోట్లు టార్గెట్ పెట్టుకొన్నామని నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ప్రకటించారు. ప్రభాస్ సినిమా తొలి రోజు రూ.100 కోట్లు సాధించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఫ్లో ఎలా ఉంటుందో చూడాలి. నార్త్ లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ అది తెలుగు రాష్ట్రాల్లోనే. రాజాసాబ్ ఒక్కటే పాన్ ఇండియా సినిమా. కాబట్టి నార్త్ సైడ్ రాజాసాబ్ కి పోటీ లేదు. దానికి తోడు… విజయ్ ‘జన నాయకుడు’ కూడా వాయిదా పడింది. ఆ రకంగా చూసినా ‘రాజాసాబ్‌కు’ ప్లస్ పాయింటే. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాకు దక్కే కొన్ని థియేటర్లు కూడా… ‘రాజాసాబ్’ ఖాతాలో పడిపోతాయి.
‘రాజాసాబ్’లాంటి సినిమాకు లాంగ్ రన్ చాలా అవసరం. ముఖ్యంగా నార్త్ లో. బాలీవుడ్ లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ యావరేజ్ గా వచ్చినా, రెండు మూడు రోజులకు పరిస్థితి కుదుటపడి, అక్కడ వసూళ్లు ఊపందుకొంటాయని చిత్రబృందం భావిస్తోంది. ఆ రెండు మూడు రోజుల వరకైనా వసూళ్లు నిలకడగా ఉండాలంటే.. మంచి టాక్ అవసరం. ఈ సినిమా కోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ పారితోషికం రూ.120 కోట్ల పైమాటే. కాబట్టి ఈ మాత్రం అవుతుంది. ఓటీటీ, నాన్ థియేట్రికల్ నుంచి దాదాపు రూ.200 కోట్లు రాబట్టారు. మరో రూ.250 కోట్లు రావాలి. అంటే బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా కనీసం రూ.400 కోట్లు సాధించాలి. రాజాసాబ్ టార్గెట్ ప్రస్తుతానికి ఇదే. ప్రభాస్ సినిమా నార్త్ సైడ్ హిట్టయితే, అక్కడ జనాలకు నచ్చితే కచ్చితంగా రూ.1000 కోట్లు వస్తాయి. టి.జి.విశ్వ ప్రసాద్ నమ్మకం కూడా అదే. మంచి టాక్ వచ్చి, సినిమా నిలబడితే.. రాజాసాబ్ రూ.1000 కోట్ల మార్క్ వైపు దూసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడాలి.. ఏం జరుగుతుందో?


