ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ‘రాజాసాబ్’ ఒకటి. జనవరి 9న విడుదల చేస్తున్నారు. 8నే ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత విశ్వ ప్రసాద్ ఇప్పటికే అభిమానులకు మాట ఇచ్చేశారు. అంటే… మరో 20 రోజుల సమయం ఉందన్నమాట. ఈలోగా ప్రమోషన్ల పర్వానికి తెర లేపారు. ఇప్పటికే ఓ టీజర్, ట్రైలర్ వచ్చాయి. ఓ పాటని వినిపించారు. రెండో పాట ‘సుహానా..’ ఈరోజు బయటకు వచ్చింది. తమన్ ఈసారి మంచి మెలోడీ అందించాడు. ట్యూన్ మరీ కొత్తగా లేకపోయినా… వినగానే ఎక్కేస్తుంది. బాలీవుడ్ సింగర్ విశాల్ మిశ్రా గొంతులో ఈ పాట ఇంకొంచెం కొత్తదనం రంగరించుకొంది. కె.కె సాహిత్యం అందించారు. గ్రీస్ లో షూట్ చేసిన పాట ఇది. లొకేషన్స్ కూల్ గా ఉన్నాయి. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్, గ్రేస్, స్టెప్స్ సూపర్ కూల్ గా అనిపించాయి. నిధి అగర్వాల్ ప్రభాస్‌తో స్టెప్పులు వేసింది.
ప్రభాస్‌ని ఇంత కలర్‌ఫుల్ గా చూసి చాలా కాలం అయ్యింది. మాంటేజ్ సాంగుల్లో అటు నుంచి ఇటు నడుచుకొంటూ వెళ్లిపోవడం తప్ప ప్రభాస్ స్టెప్ప్ వేయడానికి పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. ఈ పాటలో ఉన్న టెంపో… ప్రభాస్ తో స్టెప్పులు వేయించిందనుకోవాలి. ఈ సినిమాలో ఓ మాస్ బీట్ ఉంది. అందులో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో ఆడి, పాడతాడు. ఆ పాటలో మాత్రం ప్రభాస్ లోని మాస్ ని చూడొచ్చు. చాలా కాలం తరవాత ఈ పాటలోనే ప్రభాస్ హెవీ స్టెప్పులు వేశాడని చిత్రబృందం చెబుతోంది. తమన్ కూడా ఈ పాట వేరే స్థాయిలో ఉండబోతోందని అభిమానులకు మాట ఇచ్చేశాడు. ఆ ఆల్బమ్ మొత్తంలో ఫ్యాన్స్ కి నూటికి నూరు పాళ్లు కిక్ ఇచ్చే పాట అదే కావొచ్చు. ఈనెల 27న హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక చేసే అవకాశం కనిపిస్తోంది. అనుమతుల కోసం ప్రభుత్వాన్నిచిత్రబృందం సంప్రదిస్తోంది. పర్మిషన్లు రాగానే పనులు ప్రారంభిస్తారు.
