రాజాసింగ్ బెదిరింపులను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక ఆయనను భరించలేమని డిసైడ్ అయింది. రాజీనామాను ఆమోదిస్తూ ఆయనకు సమాచారం పంపింది. ఆయన భావజాలం బీజేపీ తట్టుకోలేకపోతోందని.. ఆయన క్రమశిక్షణ లేని తనాన్ని భరించలేకపోతోందని.. ఇక ఆయన సేవలు బీజేపీ అవసరం లేదని తేల్చేశారు. రాజీనామా చేసినందుకు సంతోషపడినట్లుగా బీజేపీ అగ్రనాయకత్వం లేఖ పంపింది.
రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించకుండా.. ఎవరైనా తనను బుజ్జగిస్తే బాగుండని అనుకున్నారు. రెండు రోజులుగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. ఓవైసీ కాలేజీ కూల్చాలని రామచంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. గతంలో తాను ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ కూడా పెట్టారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కొంత మంది పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. రాజీనామా బెదిరింపులు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో రెండు సార్లు రాజీనామాలు చేసినా బుజ్జగించారు. ఓ సారి సస్పెండ్ చేసినా.. మళ్లీ తీసుకుని టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం భరించలేమని తేల్చేశారు.
రాజాసింగ్ ను భరించడం కష్టమని కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు హైకమాండ్ కు చెప్పడంతో రాజీనామా ఆమోదించేశారు. ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలోనూ చేరలేరు. ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకోదు. ఆయన పార్టీలో ఉంటే చాలా వర్గాలు దూరమైపోతాయన్న భయం అన్ని పార్టీల్లో ఉంది. గతంలో శివసేన పార్టీకి తెలంగాణ చీఫ్ గా మారుతారని అుకున్నారు. ఇప్పుడు ఆ శివసేన పార్టీనే రెండు అయింది. ఏ శివసేనకు చీఫ్ అవ్వాలో ఆయనకే క్లారిటీ ఉండదు. ఎలా చూసినా రాజాసింగ్ రాజకీయంగా తొందరపడి రోడ్డున పడ్డట్లు అయింది.