కుటుంబంలో గొడవపడి బయటకు వచ్చానని ఎప్పటికైనా మళ్లీ కుటుంబంతో చేరుతానని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. కుటుంబం అంటే బీజేపీ అన్నమాట. తనలో నిలువెల్లా బీజేపీ రక్తం ఉంటుందని తాను బీజేపీ మనిషినని ఆయన చెప్పుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తాను బీజేపీలోకే వెళ్తానని చెబుతున్నారు. రాష్ట్ర పెద్దలు లేదా కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరు పిలిచినా తాను పార్టీలో చేరిపోతానని అంటున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు వస్తుందని నమ్మకం ఉందని చెబుతున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు తాను పోటీ చేస్తానని హడావుడి చేశారు. ఆ సమయంలో రాజీనామా చేసేశారు. ఆయన తీరుతో అప్పటికే రాష్ట్ర నేతలు విసిగిపోయారు. అంత కంటే మంచి చాన్స్ రాదని చెప్పి రాజీనామాను రెండు, మూడు రోజుల్లోనే ఆమోదించేశారు. దీంతో ఆయన బీజేపీకి దూరం అయిపోయారు. కానీ ఏ పార్టీలోనూ చేరలేకపోయారు. రాజాసింగ్ కు మరే పార్టీ సరిపడదు. ఆయన తీరుతో ఏ పార్టీ కూడా చేర్చుకోదు. దాంతో ఆయన ఒంటరిగా మారిపోయారు. ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతో మళ్లీ పార్టీలో చేరాలనుకుంటున్నారు.
యూపీ సీఎం ఆదిత్యనాథ్ సాయంతో ఆయన బీజేపీలో మళ్లీ చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు రాష్ట్ర నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇలా ఎవరితోనూ ఆయనకు సత్సంబంధాలు లేవు. అందుకే బీజేపీలోకి రాజాసింగ్ ఎంట్రీ అంత తేలిక కాదు. గతంలోనే ఆయనను ఓ సారి సస్పెండ్ చేసినప్పుడు ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తేసి టిక్కెట్ ఇచ్చారు. ఈ సారి కూడా ఆయనకు ఎన్నికలకు ముందే పార్టీలో చేర్చుకుని మళ్లీ టిక్కెట్ ఇవ్వొచ్చు. అప్పటి వరకూ ఆయన ఎదురు చూస్తూనే ఉండాల్సి రావొచ్చు.
