బీజేపీ పెద్దలు పిలిస్తే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ పార్టీలో చేరిపోతానని రాజాసింగ్ అంటున్నారు. తనకు బీజేపీ మాత్రమే కరెక్ట్ అని ఆయన చెప్పుకుంటున్నారు. తనకు తానే .. ఆరోపణలు చేసి రాజీనామా చేసిన ఆయన … ఇప్పుడు బీజేపీ హైకమాండ్ పిలిస్తే చాలని అనుకుంటున్నారు. పోనీ దాని కోసమైనా పద్దతిగా ఉంటున్నారా అంటే.. అలాంటిదేమీ లేదు. మళ్లీ బీజేపీ వ్యవహారాలను గెలుక్కుంటున్నారు.
బీజేపీ రాష్ట్ర కమిటీని రామచంద్రరావు ప్రకటించారు. ఈ కమిటీ కిషన్ రెడ్డి వేసినట్లుగా ఉందని రాజాసింగ్ మండిపడ్డారు. ఈ కమిటీతోనే పార్టీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కూడా సవాల్ చేశారు. అసలు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ వ్యవహారాలపై ఎందుకు కామెంట్ చేస్తున్నారన్నది ప్రధానమైన ప్రశ్న. ఆయన రాజీనామా చేయకుండా ఉన్నట్లయితే.. ఇలా మాట్లాడే మాటలకు కాస్త విలువ ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఉండదు.
అనర్హతా వేటు వేయించాలని బీజేపీ అనుకోవడం లేదు. ఆయన స్వయంగా రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ ఫిర్యాదు చేస్తే అనర్హతా వేటు పడుతుంది. బీజేపీకి రాజీనామా చేసి బీజేపీ విషయాలు మాట్లాడుతున్నారని.. ఆయన పదవికి రాజీనామా చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాపైనా స్పందించారు. కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. అసలు కిషన్ రెడ్డితో రాజాసింగ్ ఎందుకు పోటీ పడుతున్నారో కానీ.. పార్టీకి రాజీనామా చేసినా.. బీజేపీ గురించి మాట్లాడుతూనే ఉంటానని ఆయన అంటున్నారు. ఇలా అయితే రేపు ఎప్పుడైనా రాజాసింగ్ ను పార్టీలోకి మళ్లీ పిలుద్దామని అనుకున్నా.. పిలవరు.. ఆగిపోతారు. రాజాసింగ్ భవిష్యత్ లో జరిగే నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు.