హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రదర్శకులైన వీరిద్దరూ త్వరలో ఒకే కథతో సినిమాలు తీయబోతున్నారు. వారిద్దరి జీవితాశయంకూడా అదే! మహాభారతం కథతో సినిమా తీయటం. దానవీరశూర కర్ణ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో రీమేక్ చేయటం తన కల అని వి.వి.వినాయక్ ఎప్పటినుంచో చెబుతుండటం తెలిసిన విషయమే. మహాభారతాన్ని తెరకెక్కించటమే తన జీవితాశయం అని, ఇప్పటివరకు తాను తీసిన చిత్రాలన్నీ ఆ ఆశయానికి మెట్లని, జూనియర్ ఎన్టీఆర్ ఆ చిత్రంలో కృష్ణ పాత్ర పోషిస్తారని రాజమౌళి ఇటీవల వెల్లడించిన సంగతీ విదితమే. అలనాటి దానవీరశూరకర్ణ చిత్రం మహాభారతం కథాంశంతో తీసినదే కావటంతో ఇద్దరూ ఒకే కథతో పోటీపడబోతున్నారనేది సుస్పష్టం. ఇద్దరి చిత్రాలలో ఎన్టీఆరే కథానాయకుడు. మరి వీరిద్దలో ఎవరు ఈ ప్రాజెక్ట్‌ను ముందు ప్రారంభిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.
దానవీరశూరకర్ణలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలలో నటించారు. నాడు అతి తక్కువ బడ్జెట్‌తో స్వల్పకాలంలో తీసిన ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ చిత్రంలో కథ పరంగా కర్ణుడు కథానాయకుడైనప్పటికీ, దుర్యోధనుడే హీరో అనిపించటం విశేషం. ఆచార్యదేవా! ఏమంటిరి ఏమంటిరి? అంటూ ఆ చిత్రంలో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు నాటికీ, నేటికీ మోస్ట్ పాపులర్. చిత్రం స్క్రీన్‌ప్లే బాగుంటుంది, స్క్రిప్ట్కూడా సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో వినాయక్ పని సులభమైనట్లే. మరోవైపు మగధీర, బాహుబలి వంటి చారిత్రక కథాంశాలతో, గ్రాఫిక్స్‌తో చిత్రాలు తీసిఉండటంతో రాజమౌళికి పీరియడ్ మూవీలను తెరకెక్కించటంపై, టెక్నాలజీపై పూర్తి కమాండ్ వచ్చి ఉంది. దానికితోడు రాజమౌళి స్థాయి జాతీయ, అంతర్జాతీయస్థాయికి చేరిపోయింది. సినిమా మొదలుపెట్టాలేగానీ పెట్టుబడి, వనరులు, నటీనటులు అన్నీ వాటంతటవే ఆయనదగ్గరికి వచ్చేస్తాయి.
ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించటంతో వీరిద్దరిమధ్య పోటీ ఏర్పడినట్లయింది. కానీ వీరిద్దరూ మంచి మిత్రులు. అత్యంత సంక్లిష్ట కథాంశమైన మహాభారతాన్ని ఎవరు ముందు తీస్తారో, ఎవరు విజయం సాధిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే వేచి చూడాల్సిందే!