ఎస్.ఎస్. రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు. విజనరీ కూడా. భవిష్యత్తు సినిమా ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఊహించగలడు. ఆ దిశగా అడుగులు వేయగలడు. ఆయన దృష్టంతా సినిమాపై. వేరే వ్యాపకాలేం లేవు. వ్యాపారాలు అస్సలు లేవు. కాకపోతే ఇప్పుడు వీఎఫ్ఎక్స్ స్టూడియోలో పెట్టుబడి పెట్టినట్టు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఇది కూడా సినిమాకు సంబంధించిన వ్యవహారమే కాబట్టి, వ్యాపారం విషయంలోనూ సినిమాలతోనే మమేకం అయినట్టు అనుకోవచ్చు.
వీఎఫ్ఎక్స్ పై ఎవ్వరికీ లేనంత అవగాహన రాజమౌళికి ఉంది. అందుకే ఆయన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ అంత క్వాలిటీగా ఉంటాయి. ఈగ సినిమా తీసేటప్పుడే వీఎఫ్ఎక్స్ కి సంబంధించిన ఎత్తు, పల్లం, లోతు మొత్తం తెలుసుకొన్నారు. ఆ సబ్జెక్ట్ పై గ్రిప్ సంపాదించిన తరవాతే.. ఈగ సినిమా మొదలెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఎలాంటి పనితీరు కనబరుస్తున్నాయి? ఏ వర్క్ ఎవరి చేతుల్లో పెడితే అవుట్ పుట్ బాగుంటుంది? అనరే విషయంలో ఆయనకు మంచి అవగాహన ఉంది.
అందుకే ఇప్పుడు వీఎఫ్ఎక్స్ స్టూడియోలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఓ కొత్త వీఎఫ్ఎక్స్ స్టూడియోకి రూపకల్పన జరిగింది. ఈ సంస్థలో రాజమౌళికి కూడా భాగస్వామ్యం ఉందట. ఈ స్టూడియోలో వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అందుబాటులో ఉందని తెలుస్తోంది. ‘వారణాసి’కి సంబంధించిన ఎఫెక్ట్స్ లో సింహభాగం ఇక్కడే రూపొందిస్తున్నారని సమాచారం. రాజమౌళి చేతిలోనే ఓ వీఎఫ్ఎక్స్ స్టూడియో ఉంటే, వారణాసిలో ఎఫెక్ట్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వారణాసికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. మేలో మహేష్ విదేశాలకు వెళ్తారు. ఆ సమయంలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి, రాజమౌళి కూడా విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు.
