ఇంటర్నెట్‌ద్వారా విడుదలే పైరసీకి పరిష్కారం – రాజమౌళి

హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమకు అత్యంత భయంకరమైన శత్రువు ఎవరంటే పైరసీయేనని నిర్మాతలు, దర్శకులు ముక్తకంఠంతో చెబుతారు. ఈ పైరసీకి దర్శక బాహుబలి రాజమౌళి ఒక పరిష్కారం సూచిస్తున్నారు. ఇంటర్నెట్‌ద్వారా విడుదలచేయటంద్వారా పైరసీని తుదముట్టించొచ్చని ఆయన చెబుతున్నారు. ఇంటర్నెట్ అనే మాధ్యమాన్ని చలనచిత్ర పరిశ్రమ గుర్తించలేకపోవటంవలన దానిని పైరసీదారులు డబ్బు చేసుకుంటున్నారని రాజమౌళి చెప్పారు. కొన్నివర్గాల ప్రేక్షకులు సినిమా చూడాలని ఉన్నాకూడా ట్రాఫిక్‌లో ఇబ్బంది పడటం ఇష్టంలేకో, ఎక్కువమంది జనంమధ్యచూడటం ఇష్టంలేకో వివిధ కారణాలవల్ల ధియేటర్‌కు రారని, అటువంటివారు ఇంటర్నెట్‌లో తప్పక చూస్తారని అన్నారు. ఇంటర్నెట్ ద్వారా విడుదల చేస్తే పైరసీదారులకు వెళ్ళే డబ్బులు నిర్మాతలకు వస్తాయని చెప్పారు. పరిశ్రమ ఈ దిశలో ఆలోచించాలని అన్నారు. కేబుల్ టీవీ వచ్చిన కొత్తలో, టీవీలో 24గంటలూ అన్ని కార్యక్రమాలు వస్తుంటే ఇక సినిమాలు ఎవరు చూస్తారని చాలామంది అనుకున్నారని, కానీ ప్రేక్షకులు సినిమాలు చూడకుండా ఏమీ లేరని చెప్పారు. సినిమాను మామూలు ధియేటర్లలో విడుదల చేయటం, మార్కెట్ చేయటం ఒక ఎత్తయితే, ఇంటర్నెట్ ద్వారా విడుదలచేయటంపైకూడా పరిశ్రమ దృష్టిపెడితే మంచి ఆదాయ వనరు అవుతుందని నిన్న ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

బాలీవుడ్డో, హాలీవుడ్డో తన లక్ష్యంకాదని రాజమౌళి చెప్పారు. మహాభారతాన్ని వెండితెరకెక్కించటమే తన జీవితాశయమని అన్నారు. తాను మనసులో ఊహించనట్లుగా దానిని తెరకెక్కించగలిగితే కనీవినీ ఎరగని అద్భుత విజయం సాధిస్తుందని చెప్పారు. భారతాన్ని రెండున్నర, మూడుగంటలలో చూపించటం సాధ్యంకాదని, దానినికూడా పార్టులుగా తీయాల్సిందేనని అన్నారు. మహాభారతం తీయటమన్న తన అంతిమలక్ష్యానికి తాను ఇంతవరకూ తీసిన సినిమాలు సోపానాలని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com