కుక్కపిల్ల, అగ్గిపుల్ల, కుక్కబిళ్ల కవితకు కాదేదీ అనర్హం అంటారు శ్రీశ్రీ. రాజకీయ నేతలు కవితకు అనర్హం అని కాకుండా.. ఏదైనా రాజకీయానికి అర్హమే అని నిరూపిస్తూ ఉంటారు. ఇప్పుడు వారందరికి రాజమౌళి దొరికాడు. ఇక వదిలి పెడతారా..ఆయనకు సమర్థింపుగా కొంతమంది.. వ్యతిరేకిస్తూ మరికొంత మంది బయలుదేరారు. రోజూ వీరు స్టేట్మెంట్లతో రాజమౌళిని ప్రచారంలోకి తెస్తున్నారు. రాజమౌళి మాత్రం ఆయన పని ఆయన చేసుకుంటున్నారు.
వారణాశి ఈవెంట్లో రాజమౌళి అన్న మాటలకు ఎన్నో అర్థాలు
వారణాశి ఈవెంట్లో తాము చూపించాలనుకున్న ఏవీకి సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడిన సందర్భంలో హనుమంతుడి గురించి రాజమౌళి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన శక్తి గురించి చెబుతూ..తనకు నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడారు. ఇది ఒక్కటి చాలు ఇక మేము చూసుకుంటామని రాజకీయం రంగంలోకి దిగింది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. హిందూ సంఘాల నుంచి రాజాసింగ్ వరకూ.. చివరికి పాస్టర్ ప్రవీణ్ మద్యం మత్తులో ప్రమాదానికి గురై చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసిన హర్షకుమార్ కూడా స్పందిస్తున్నారు.ఇక పబ్లిసిటీ అంటే ముందు ఉండే ఆర్జీవీ కూడా ఓ ట్వీట్ పడేశారు. అందరూ కలిసి రాజమౌలిని హాట్ టాపిక్ చేసి పడేశారు.
ఎవరికీ రాజమౌళి అభిప్రాయంతో పని లేదు.. వారి స్వార్థమే !
వర్మ నుంచి హర్షకుమార్ వరకూ అందరూ సమర్థించడమో.. వ్యతిరేకించడమో చేస్తున్నారు. ఇక్కడ ఎవరికీ రాజమౌళితో అవసరం లేదు. కేవలం వారికి కావాల్సింది ప్రచారం మాత్రమే. రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడు. పైగా ఆయన స్పందించిన టాపిక్ మతం. అందుకే ఆయనను సమర్థిస్తే ఓ రకమైన ప్రచారం.. వ్యతిరేకిస్తే మరో రకమైన ప్రచారం వస్తుంది. ఈ ప్రచార పిచ్చిగాళ్లకు అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు. రాజమౌళికి ఈ దేశ పౌరుడిగా ఆయన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఆయనకు ఉంది. ఆయనపై కేసులు పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అవి కేసులా .. ఫిర్యాదులా అన్నదానిపై స్పష్టత లేదు. అది కూడా రాజమౌళిని అడ్డం పెట్టుకుని ప్రచారం పొందే ప్రయత్నాలే.
రాజమౌళి స్పందిస్తే మరింత రాజకీయం – సైలెంట్ గా ఉండటమే బెటర్
ఈ అంశంపై రాజమౌళి స్పందించాలని .. వివరణ ఇవ్వాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ పొరపాటున రాజమౌళి స్పందిస్తే మరింత రాజకీయం అవుతుంది. ఆ స్పందన ఆధారంగా టీవీ చానళ్లు చర్చలు కూడా ప్రారంభిస్తాయి. అందుకే రాజమౌళి.. తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లుగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ అసలు రాజకీయం మాత్రం.. జరిగిపోతోంది. దేవుడిపై రాజమౌళికి నమ్మకం ఉందా లేదా అన్నది ఆయన వ్యక్తిగతం. ఒక వేళ ఆయనకు నమ్మకం లేకపోతే బెదిరించి నమ్మకం కలిగించలేరు.. నమ్మకం ఉంటే పోయేలా చేయలేరు.
గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో ఎన్టీఆర్ పాత్రకు ముస్లిం టీవీ పెట్టారని రచ్చ చేశారు. కానీ సినిమా అయ్యాక ఆయనకు గౌరవం ఇచ్చారు. ఇది కూడా అంతే. ఆయనను రాజకీయం పావుగా చేుకుంటోంది. కానీ ఆయన మాత్రం పావుగా అవ్వాలని అనుకోవడం లేదు.