సర్వీస్ అంతా గొప్పగా పని చేసి.. చివరికి జగన్ రెడ్డి పాలబడ్డారు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ. లిక్కర్ స్కామ్లో ఆయనను ముందు కథ నడిపించారు. రిటైర్ అయిపోయినా ఆయన ఇప్పుడు ఇరుక్కున్నారు. మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు సీఐడీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకూ ఆయన అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిట్ విచారణ లో తేలింది.
మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు జరిగిన పట్టించుకోలేదని సిట్ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి(ఏ-1) మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదని సిట్ తెలుసుకుంది. కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన రజత్ భార్గవకు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చింది.
లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది? డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు? రాజ్ కసిరెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది? ధరల నియంత్రణ లేకపోవడానికి కారణమేంటి? కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనను ఎందుకు పట్టించుకోలేదు? ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో పదివేల బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వరాదన్న నిబంధనను ఆదాన్కు ఎందుకు వర్తింప చేయలేదు?
మొదటి నెలలోనే 1.80లక్షల కేసుల మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక గల కారణాలేంటి। రిటైల్ అవుట్లెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో సత్య ప్రసాద్ ద్వారా డిపో మేనేజర్లు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అనే అనేక ప్రశ్నలకు రజత్ భార్గవ సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.
అలాగే అనూష అనే మహిళకు నిబంధనలకు విరుద్ధంగా ఎంఐఎస్ విభాగంలో నియమించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కోసం స్పెషల్ మెమో ఇచ్చారు. ఆమె ప్రతి రోజు లిక్కర్ అమ్మకాల గురించి సైఫ్ అహ్మద్ కు సమాచారం ఇస్తే.. ఆయన రాజ్ కసిరెడ్డికి వివరాలు పంపి ముడుపులు సేకరించారు. అన్నీ తెలిసి కూడా ఎందుకు సైలెంటుగా ఉన్నారో తేల్చనున్నారు.
రజత్ భార్గవ.. మచ్చ లేకుండా విధులు నిర్వర్తించారు. కానీ జగన్ ఆయనను మద్యం స్కాంలో సంతకాలకు వాడుకున్నారు. రజత్ భార్గవ కాదనలేకపోయారు. తన మెడకు చుట్టుకుటుందని తెలిసినా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కేసుల పాలయ్యారు. అప్రూవర్ గా మారిపోయి అన్నీ చెబితే.. ఆయనను సాక్షిగానే పరిగణించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.