తమిళ సినిమాకు రెండు కళ్లయిన రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి నటిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. వీరిద్దరూ మంచి స్నేహితులు. వెండి తెర పై వీరిద్దరూ కలిసి నటించి దాదాపు 40 ఏళ్లయ్యింది. ఈ సుదీర్ఘ విరామానికి తెర దించాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. మణిరత్నం ఒకానొక దశలో వీరిద్దరితో ఓ సినిమా చేద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. అయితే ఆ అవకాశం ఇప్పుడు లోకేష్ కనగరాజ్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణాదిన టాప్ రేంజ్‌ని సొంతం చేసుకొన్న దర్శకుడు లోకేష్. ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ తీస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. రజనీకాంత్, కమల్ హాసన్ కోసం లోకేష్ ఓ కథ రాశార్ట. వయసు పైబడిన ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ కథ అట. రిటైర్ అయిపోయిన తరవాత వీరిద్దరూ కలసి ఏం చేశారన్నది కాన్సెప్ట్. ఐడియా పరంగా క్రేజీగా ఉంది. రజనీ, కమల్.. వయసుకు తగిన పాత్రలు. ఇప్పుడు రజనీకాంత్ తో ఎలాగూ ‘కూలీ’ చేస్తున్నాడు. కమల్ తో ఆల్రెడీ ‘విక్రమ్’ చేశాడు. కాబట్టి ఇద్దరు హీరోలతోనూ మంచి రాపో వుంది. లోకేష్ లాంటి దర్శకుడు ఓ ఐడియాతో వచ్చాడంటే కచ్చితంగా దానికి వాల్యూ ఇస్తారు. కాబట్టి ఈ కాంబోని ఈజీగా కొట్టిపారేయలేం.
కాకపోతే.. ఈలోగా లోకేష్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కూలీ తరవాత ముందుగా పట్టాలెక్కు సినిమా ‘ఖైదీ 2’. ఆ తరవాత ‘విక్రమ్ 2’ కూడా ఉంది. రోలెక్స్ పాత్రతోనే ఓ సినిమా చేయాలన్నది లోకేష్ ఐడియా. అందుకు సంబంధించిన కథ కూడా సిద్ధంగా ఉందట. ‘కూలీ 2’కీ అవకాశాలు ఉన్నాయి. `లియో 2`కి సరిపడ కథ కూడా లోకేష్ పూర్తి చేశాడు. ఇవన్నీ పూర్తయితే లోకేష్ కనగరాజ్ పార్ట్ 2 స్పెషలిస్ట్ అయిపోతాడు. అన్నట్టు ‘మాస్టర్ 2’ సినిమా కూడా చేయాలని ఉందట. కానీ విజయ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాలతో మమేకం అయిపోయాడు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమే. ఈ పార్ట్ 2ల కథ ఎలా ఉన్నా.. రజనీకాంత్, కమల్ ప్రాజెక్టుపై లోకేష్ దృష్టి పెడితే, పట్టాలెక్కడం పెద్ద మేటరేం కాదు. పైగా కమల్, రజనీ… ఇద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఇదే మంచి ఛాన్స్.