‘నరసింహా’ సినిమాని రజనీకాంత్ ఫ్యాన్స్ అంత తేలిగ్గా మర్చిపోరు. రజనీ కెరీర్లో ఇదో సూపర్ హిట్. అయితే సినిమా పూర్తయ్యాక రజనీకాంత్ కంటే నీలాంబరి పాత్రే ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ తన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఇప్పటికీ రమ్యకృష్ణ మదిలో మెదలగానే.. నీలాంబరి పాత్ర, అందులోని స్వాగ్.. గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ‘నరసింహా’కు సీక్వెల్ చేయడానికి రజనీ సిద్ధం అవుతున్నార్ట. అందుకు సంబంధించిన కథ కూడా రెడీ అయ్యిందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్లుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయకపోవొచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏ దర్శకుడైనా ఈ కథ డీల్ చేసే అవకాశం ఉంది.
అయితే దర్శకుడిగా ఎవరిని ఎంచుకొన్నా ఓకే. కానీ.. నీలాంబరి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రధానం. నీలాంబరిగా రమ్యకృష్ణని రీప్లేస్ చేసే నటిని ఎంచుకోవడం చాలా కష్టం. వయసు రీత్యా రమ్య ఈ సినిమాలో నటించకపోవొచ్చు. అందుకే ఆ పాత్రలో మరో నటిమణిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. రజనీ స్వాగ్ ని తట్టుకొని, తనదంటూ ఓ ముద్ర వేసే కథానాయికని పట్టుకోవడంలోనే అసలైన టాస్క్వుంది. బహుశా చిత్రబృందం కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్ని కథలకు సీక్వెల్ తీయకపోవడమే బెటర్. ఎందుకంటే ఇది వరకే ఆయా సినిమాలపై ఉన్న కల్ట్ ముద్ర.. ఇప్పటి సీక్వెల్ కి భారంలా అనిపించే అవకాశం ఉంది. నీలాంబరి పాత్రధారి ఎంపికలో ఏమాత్రం తప్పు చేసినా – ‘నరసింహా’ కష్టం వృథా అయినట్టే.
