రాజ‌కీయాల దిశ‌గా ర‌జ‌నీ…!

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఒక్కసారిగా చెబితే ప్ర‌త్య‌ర్థుల గుండెలు ఆగిపోతాయ‌నుకున్నాడో..లేక అప్పుడే రాజ‌కీయం నేర్చుకున్నాడో… ర‌జ‌నీ కాంత్ పెద్ద బాంబే పేల్చేలా ఉన్నాడు. ఒక‌సారి అభిమానుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి, ర‌ద్దు చేసుకున్న ఆయ‌న ఈసారి ఆ ప‌ని చేయ‌లేదు. నాలుగు రోజుల పాటు సెల్ఫీలు తీసుకోవ‌డానికి స‌మావేశ‌మ‌వుతున్నానంటూ చెప్పిన త‌మిళ సూప‌ర్ స్టార్ నాలుగో రోజు స‌మావేశంలో మెల్లిగా విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతున్నాడు. ప్రాంతీయ‌త అంశాన్ని ప్ర‌స్తావించాడు. వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. క‌ర్ణాట‌క‌లో పుట్టిన నన్ను త‌మిళులు త‌మ‌వారిగా ఆద‌రిస్తున్నారు. 43ఏళ్ళుగా త‌మిళ‌నాడులో ఉంటున్నా.. కాబ‌ట్టి నేను త‌మిళుడ‌నేనంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తే ప్రాంతీయ‌త అంశాన్ని స్థానిక పార్టీలు ప్ర‌స్తావిస్తాయేమోన‌నే అనుమానం ఎక్క‌డో ఆయ‌న మెద‌డులో తొలిచి ఉంటుంది. ఇదెందుకు అడ్డుప‌డాల‌నుకున్నారో ఏమో.. తాను ఫ‌క్తు త‌మిళుడ‌న‌ని అభిమానుల స‌మావేశంలో చెప్ప‌డం ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాన‌ని చెప్ప‌డ‌మేన‌ని భావించ‌వ‌చ్చు. ఇప్పటివ‌ర‌కూ వెండ‌తెర‌పై న‌టించిన ర‌జ‌నీ రాజ‌కీయ య‌వ‌నిక‌పై త‌ళుక్కున మెర‌వ‌డానికి ఇంకెంతో కాలం ప‌ట్ట‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఊహ నిజం కావ‌చ్చు..కాక‌పోవ‌చ్చు. ఫ‌క్తు త‌మిళ సంప్ర‌దాయాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న త‌లైవ‌ర్‌.. క‌బాలీ సినిమాలో న‌టించ‌డం వెనుక వ్యూహం కూడా ఇదేనేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆయ‌న మ‌లేసియాలోని త‌మిళుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే పాత్ర‌లో న‌టించారు.

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో కూడా చిరంజీవి రాజ‌కీయ ప్ర‌వేశానికి ముందు న‌టించిన ముఠామేస్త్రే, ఠాగూర్‌, ఇంద్ర‌, స్టాలిన్ సినిమాల ద్వారా సంకేతాల‌ను పంపారు. ఆఖ‌రుకు ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం కెమెరామెన్ గంగ‌తో రాంబాబుతో త‌న‌కు రాజ‌కీయాల ప‌ట్ల అనుర‌క్తుంద‌ని వెల్ల‌డించాడు. గ‌బ్బ‌ర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు అవే దిశ‌గా ఆయ‌న భావి ప‌యనాన్ని సూచించాయి. ఆల‌స్య‌మ‌వుతుందేమో కానీ.. రావ‌డం మాత్రం ప‌క్కా అంటూ డైలాగులతో ఊరించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన ఏర్పాటుచేశారు. సో ఇవ‌న్నీ చూస్తుంటే… ర‌జ‌నీ రావ‌డం కూడా ప‌క్కా అనే అనిపిస్తోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆయ‌న వెన‌కుండి న‌డిపిస్తోంద‌ని అంటున్నారు. త‌మిళ రాజ‌కీయాల గురించి త‌ర‌చూ మాట్లాడే కేంద్ర మంత్రి వెంక‌య్య ఈమ‌ధ్య అటువైపుగా చూడ‌డం లేదు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాట గంద‌ర‌గోళాన్ని సృష్టించి, క్ర‌మేపి చ‌ల్ల‌బ‌డేలా చేసిన క‌షాయ ద‌ళ తొలుత క‌మ‌ల్ హాస‌న్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. క‌మ‌ల్ భార్య గౌత‌మి దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం వెనుక నిజాల‌ను తేల్చాల‌ని ప్ర‌ధానికి లేఖ రాయ‌డం, ఆ త‌దుప‌రి క‌మ‌ల్‌తో ఆమె తెగ‌తెంపులు చేసుకోవ‌డం ఈ అనుమానానికి కారణమ‌వుతోంది. ఇక ఆ కుటుంబంతో ప‌ని జ‌ర‌గ‌ద‌ని నిర్ణ‌యానికొచ్చిన బీజేపీ ర‌జ‌నీని బుట్ట‌లో వేసిన‌ట్లే ఉంది. చూడాలి… ఆయ‌న వ్యాఖ్య‌ల మ‌ర్మం… ఎప్ప‌టికి వెల్ల‌డ‌వుతుందో!!
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com