ఇండియన్ సినిమాలో హీరోలదే ఆధిపత్యం. పోస్టర్ పై వున్న హీరో క్రేజ్ తో బిజినెస్ జరుగుతుంది. అయితే ఈ ట్రెండ్‌లో క్రమంగా మార్పు వచ్చింది. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకులు హీరోలకి ధీటుగా వెలుగుతున్నారు. అటు ట్రేడ్ వర్గాల్లో డైరెక్టర్ ఫాక్టర్ అనేది కీలకంగా మారింది. హీరో ఇమేజ్‌కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, దానికి సమానంగా దర్శకుడి క్రేజ్‌ని చూస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాకి జరిగిన బిజినెస్.
ఈ సినిమా అన్ని డీల్స్‌ను రికార్డ్ స్థాయిలో ముగిస్తున్నారు మేకర్స్. తాజాగా రూ. 81 కోట్లకు అన్ని భాషల ఓవర్సీస్ హక్కులు డీల్ క్లోజ్ అయ్యాయి. దీనికి కారణం రజనీకాంత్ అనుకుంటే పొరపాటు. ఆయన గత చిత్రం ‘వెట్టయాన్’ సరిగ్గా ఆడలేదు. ఆ సినిమాకి బిజినెస్ చాలా డల్‌గా జరిగింది. మరి వున్న ఫలంగా ‘కూలీ’కి ఎందుకంత హైప్? దీనికి కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
లోకేష్ సినిమా అంటే ఇప్పుడు మార్కెట్లో హాట్ కేక్. ఆయన గత చిత్రం ‘లియో’ అనుకున్నంత రీచ్ కాలేదు. అయినప్పటికీ లోకేష్‌పై నమ్మకం పోలేదు. అతని టేకింగ్, వరల్డ్ బిల్డింగ్‌పై ట్రేడ్ వర్గాల్లో చాలా క్రేజ్ వుంది. లోకేష్ టేకింగ్‌లో రజనీ సంచలనాలు సృష్టిస్తాడని నమ్మకం బిజినెస్ సర్కిల్లో వుంది. దీనికితోడు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్, పూజా హెగ్డే… ఇలా భారీ తారాగణం సెట్ చేశాడు. ఇదంతా గట్టిగానే పే అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వుంది.
ఇటీవలే కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో వచ్చారు. ఆ సినిమాలో కూడా భారీతారాగణం వుంది. ‘నాయకుడు’ లాంటి కల్ట్ కాంబినేషన్లో సినిమా వచ్చింది. అంతకుముందు కమల్‌కు ‘విక్రమ్’ లాంటి పాన్ ఇండియా విజయం వుంది. కానీ ‘థగ్ లైఫ్’కి ‘కూలీ’ లాంటి క్రేజీ బిజినెస్ జరగలేదు. దీనికి కారణం.. డైరెక్టర్ ఫాక్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.